Hardik Pandya : ఎంతైనా ఖర్చు పెట్టేందుకైనా ముంబై సిద్ధం.. రికార్డులు చెరిపేయనున్న పాండ్యా
ఐపీఎల్ ఫీవర్ అప్పుడే మొదలైంది. డిసెంబర్ లో వేలం పాట, దానికంటే ముందు ప్లేయర్ల ట్రేడింగ్ ఉండటంతో ఏ జట్టుకు ఏ ఆటగాడు వెళ్తాడాఅని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో గతకొన్నిరోజులుగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా గుజరాత్ ను వీడుతున్నాడని, మళ్లీ ముంబై గూటికే చేరుతున్నాడని అంటున్నారు. తొలి ఏడాదిలోనే జట్టును విజేత నిలబెట్టి, రెండో సారి ఫైనల్స్ కు చేర్చిన హార్దిక్ ను గుజరాత్ నిజంగానే వదులుకుందా అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. ఫ్రాంచేజీలు పరస్పర అంగీకారంలో ప్లేయర్లను మార్చుకునే ట్రేడింగ్ విండో ఇవాళ ముగుస్తుండటంతో.. అంతా ఆసక్తి నెలకొంది.
ఏ ప్లేయర్ ఏ జట్టులోకి వెళ్తాడని ఎదురుచూస్తున్నారు. అయితే హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ విషయంపై అటు గుజరాత్ గానీ, ఇటు ముంబైగానీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ ముంబై మాత్రం హార్దిక్ ను తిరిగి జట్టులోకి తీసుకోవడానికి సిద్ధం గా ఉన్నట్లు తెలుస్తుంది. దాదాపు రూ.15 కోట్లు పెట్టి పాండ్యాను కొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ముంబై జట్టులో కేవలం రూ.5 లక్షలే మిగిలున్నాయి. అందుకు ముంబైలోకి కమెరున్ గ్రీన్ (రూ.17.5 కోట్లు), ఆర్చర్ (రూ.8 కోట్లు)ను వదులుకునేందుకు ముంబై సిద్ధం అయింది. మరోవైపు పాండ్యాను విడుదల చేసేందుకు గుజరాత్ ఫ్రాంచేజీకి పెద్ద మొత్తంలో ముంబై చెల్లిస్తుందని సమాచారం. ఈ మొత్తంలో పాండ్యాకు 50 శాతం దక్కుతుంది. అయితే డీల్ ఎంతకు కుదిరింది అనే మాత్రం ఏ ఫ్రాంచేజీ బయటపెట్టడంలేదు.
2022 ఐపీఎల్ సీజక్ ముందు ముంబై పాండ్యాను వదులుకోగా.. అతన్ని గుజరాత్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ‘పాండ్యా ముంబై జట్టుకు మారడంపై చర్చలు జరిగాయి. అతను ఫ్రాచేజి మారే అవకాశం ఉంది. అయితే ఒప్పందం ఇంకా పూర్తి కాలేద’ని గుజరాత్ జట్టు వర్గాలు తెలిపాయి. ఒకవేళ పాండ్యా నిజంగానే ముంబైకి తిరిగొస్తే.. కెప్టెన్ అవుతాడా లేదా రోహిత్ శర్మ సారథ్యంలోనే ఆడతాడా క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ పాండ్యా నిజంగానే గుజరాత్ ను వీడితే కెప్టెన్ గా ఆ జట్టు శుభ్ మన్ గిల్ ను ప్రకటిస్తుంది. మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్ శార్దూల్ ఠాకూర్, లోకి ఫెర్గూసన్, టిమ్ సౌథీలను వదులుకునేందుకు సిద్ధమైందని సమాచారం. పంజాబ్ కింగ్స్ ఐపీఎల్‌లోనే అత్యంత ఖరీదైన ఆటగాడు సామ్ కరన్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించిందట.