Heinrich Klaasen : సౌతాఫ్రికాకు సడెన్ షాక్.. 32 ఏళ్లకే టెస్టులకు హిట్టర్ గుడ్ బై
లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ లో దూకుడైన ఆటతీరును కనబరిచే సౌతాఫ్రికా హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 32 ఏళ్లకే టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయంపై మాట్లాడిన క్లసెన్.. టెస్టుల నుంచి తప్పుకోవడం గురించి ఆలోచిస్తూ.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపినట్లు చెప్పాడు. తాను తీసుకోబోయే నిర్ణయం మంచిదా? కాదా? అని చాలామందిని అడిగినట్లు తెలిపాడు. వారి సూచనల మేరకు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించినట్లు చెప్పుకొచ్చాడు.
‘టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడం చాలా కఠినమైన నిర్ణయం. నా ఫేవరెట్ ఫార్మట్ కు గుడ్ బై చెప్తున్నందుకు బాధగా ఉంది. వన్డేలు, టీ20ల్లో రాణించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’ అని క్లాసెన్ చెప్పుకొచ్చాడు. 2019లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన క్లాసెన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. తన కెరీర్ లో నాలుగు టెస్టులో ఆడిన క్లాసెన్.. 104 పరుగులు చేశాడు. కాగా ఐపీఎల్ 2023 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడి అదరగొట్టిన క్లాసెన్ ను.. ఈ సీజన్ కోసం కూడా ఎస్ఆర్హెచ్ అంటిపెట్టుకుంది.