AUS vs SL: స్టేడియంలో కూలిన హోర్డింగ్.. తప్పిన ప్రమాదం
లక్నో వేదికగా జరిగిన ఆస్ట్రేలియా-శ్రీలంక మధ్య మ్యాచ్‌లో అనూహ్య సంఘటన జరిగింది. భారీ గాలులకు స్టేడియంలో ఏర్పాటు చేసిన హోర్డింగ్ కూలిపోయింది. ఈ ఘటనతో మైదానంలో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. శ్రీలంక బ్యాటింగ్ చేస్తుండగా 32 ఓవర్లు ముగిసిన తర్వాత.. వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. ఈ సమయంలో స్టేడియంలో భారీ ఈదురు గాలి వీచింది. ఈదురు గాలుల కారణంగా స్టేడియం పైకప్పు చివర్లో ఏర్పాటు చేసిన హోర్డింగ్ విరిగి పడింది. హోర్డింగ్ పడిన ప్రాంతంలో తక్కువ మంది ప్రేక్షకులు ఉండటం.. వారు ముందే అప్రమత్తమై అక్కడి నుంచి దూరంగా పరిగెత్తడంతో ప్రమాదం తప్పింది.
ఈ ఏడాది జూన్‌లో వీచిన భారీ గాలులకు లక్నో స్టేడియం బయట ఏర్పాటు చేసిన అడ్వర్టజయింట్‌మెంట్ హోర్డింగ్ విరిగి ఓ కారు మీద పడింది. దీంతో కార్లో ప్రయాణిస్తున్న తల్లీకూతుళ్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హోర్డిగ్ కూలిన ఘటనపై ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా స్పందించాడు. ఇలా జరగడం తనెప్పుడూ చూడలేదన్నాడు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని ఆశిస్తున్నట్లు తెలిపాడు. వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకారం లక్నోలోని ఏక్నా స్టేడియం 5 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. గత వారం సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరగ్గా.. ఆస్ట్రేలియా-శ్రీలంక జట్ల మధ్య రెండో మ్యాచ్ జరిగింది. ఇక ఇదే వేదికగా అక్టోబర్ 29న భారత్-ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి.
Hoardings falling off the Ekana Stadium roof during #AUSvsSL Luckily no casualties pic.twitter.com/2tGDSKmg2c
— Aparajita (@culesme) October 16, 2023