ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. ఇందులో ఆల్ రౌండర్స్ ర్యాంకింగ్స్ లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు మహహ్మద్ నబీ అగ్రస్థానానికి ఎగబాకాడు. దాదాపు ఐదేళ్ల పాటు ఈ స్థానంలో కొనసాగిన బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకిబల్ హసన్.. రెండో స్థానానికి పడిపోయాడు. గాయం కారణంగా షకిబల్ గత కొంతకాలంగా వన్డేలకు దూరంగా ఉన్నాడు. ఈ మధ్య వన్డే క్రికెట్ లో అదరగొడుతున్న నబీ.. మొదటి స్థానానికి ఎగబాకాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో ఒక సెంచరీతో పాటు వికెట్ తీయడంతో నబీ అగ్రపీఠాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ విభాగంలో భారత ఆటగాడు రవీంద్ర జడేజా 10వ స్థానంలో కొనసాగుతున్నాడు.
బ్యాటింగ్ ర్యాంకింగ్స్ విషయానికి వస్తే.. టాప్ 10లో ఎలాంటి మార్పు జరగలేదు. టీమిండియా ఆటగాళ్లు శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వరుసగా 2,3,4 స్థానాల్లో కొనసాగుతున్నారు. బౌలర్లలో సౌతాఫ్రికా స్పిన్నర్ కేషవ్ మహరాజ్ టాప్ లో ఉన్నాడు. భారత బౌలర్లు సిరాజ్, బుమ్రా, కుల్దీప్ వరుసగా 4, 5, 9 స్థానాల్లో నిలిచారు. ఇక టెస్ట్ ర్యాంకింగ్స్ బ్యాటింగ్ లో కేన్ విలియమ్సన్, బౌలర్లలో బుమ్రా, ఆల్ రౌండర్లలో జడేజా ఉన్నారు. టీ20ల్లో బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్, బౌలర్లలో అదిల్ రషీద్ టాప్ ప్లేస్ లో ఉన్నారు.