IND vs AFG: ఆటలో ఇవన్నీ సహజం... రన్ ఔట్‌పై రోహిత్ శర్మ

Byline :  Veerendra Prasad
Update: 2024-01-12 05:09 GMT

రనౌట్ అయిన ఫ్రస్టేషన్‌లోనే శుభ్‌మన్ గిల్‌పై అరిచానని, ఆటలో ఇవన్నీ సహజమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ తప్పిదం కారణంగా రోహిత్ శర్మ రనౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో తీవ్ర అసహనానికి గురైన రోహిత్ శర్మ.. శుభ్‌మన్ గిల్‌పై నోరు పారేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం ఈ ఘటనపై స్పందించిన రోహిత్.. ఇవన్నీ ఆటలో సహజమని తెలిపాడు. ఈ మ్యాచ్ గెలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పిన అతను.. ఎన్నో సానుకూలంశాలు లభించాయన్నాడు.




 


'రనౌట్ అవ్వడం ఆటలో సహజం. రనౌటైనప్పుడు అసహనానికి గురవ్వడం కూడా సర్వ సాధారణం. ఆ ఫ్రస్టేషన్‌లో వచ్చిన మాటలు మాత్రమే. ఉద్దేశపూర్వకంగా అన్నవి కాదు. జట్టు కోసం బాగా ఆడాలనుకున్నప్పుడు ఇలా రనౌట్ అయితే ఎవరైన అసహనానికి గురవుతారు. ముఖ్యంగా పరిస్థితులన్నీ మనకు ప్రతీకూలంగా మారినప్పుడు ఇలా జరిగితే కోపం వస్తుంది. ఈ మ్యాచ్‌లో మేం గెలవడం అన్నిటికంటే ముఖ్యం. నేను ఔటైన తర్వాత శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను నడిపిస్తాడని భావించాను. దురదృష్టవశాత్తు అతను తన జోరును కొనసాగించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో మాకు అనేక సానుకూలంశాలు లభించాయి. ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ముఖ్యంగా బంతితో అద్భుతంగా రాణించాం. ప్రతికూల పరిస్థితుల్లోనూ మా స్పిన్నర్లు, పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. విభిన్న పరిస్థితుల్లో మా బౌలర్లను ప్రయోగించాం. వాషింగ్టన్‌తో 19వ ఓవర్ వేయించాం. మాకు మేం సవాల్ చేసుకున్నాం. రానున్న మ్యాచ్‌ల్లో మా బలహీనతలన్నింటినీ అధిగమించే ప్రయత్నం చేస్తాం. ఫలితంలో తేడా రాకుండా ప్రయోగాలు చేస్తాం. సమష్టి ప్రదర్శనల కోసం కృషి చేస్తాం'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.




Tags:    

Similar News