IND vs ENG 4th Test : 4వ టెస్ట్ తొలి రోజు ముగిసిన ఆట.. చెలరేగిన జో రూట్

Byline :  Shabarish
Update: 2024-02-23 12:15 GMT

టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్‌లో భాగంగా నాలుగో టెస్ట్ తొలి రోజు ఆట ముగిసింది. తొలి రోజు మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టు 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ అయిన జో రూట్ సెంచరీ సాధించాడు. జో రూట్‌ కెరీర్‌లోనే ఇది 31వ టెస్టు సెంచరీ కావడం విశేషం. టీమిండియా పేసర్ ఆకాశ్ దీప్ ధాటికి ఇంగ్లండ్ జట్టు ఇబ్బందుల్లో పడగా జో రూట్ తమ జట్టును కాస్త ఆదుకున్నాడని చెప్పాలి. ఇంగ్లండ్ జట్టు మరో బ్యాటర్ బెన్ ఫోక్స్ 126 బంతులకు 47 పరుగులు చేయగలిగాడు.




 



బెన్ ఫోక్స్‌ను భారత ఫేసర్ మహ్మద్ సిరాజ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత మరో బ్యాటర్ టామ్ హార్ట్ లేను కూడా పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు ఏడో వికెట్‌ను కూడా కోల్పోయింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి జో రూట్ 106 పరుగులతో, రాబిన్సన్ 31 పరుగులతో కొనసాగుతున్నారు. టీమిండియా బౌలర్లు ఆకాశ్ దీప్ 3, సిరాజ్ 2, జడేజా 1, అశ్విన్ 1 వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ జట్టు ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు జాక్ క్రాలే 42, బెన్ డకెట్ 11 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఆ తర్వాత ఓల్లీ పోప డకౌట్ అవ్వగా జానీ బెయిర్ స్టో 38 పరుగులతో రాణించాడు. ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ 3 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.




 


ఇకపోతే ఇంగ్లండ్ జట్టు బ్యాటర్ జో రూట్ భారత్‌పై టెస్టుల్లో 10వ సెంచరీ చేయడం విశేషం. టీమిండియాపై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా జోరూట్ రికార్డుకెక్కాడు. ఇప్పటి వరకూ భారత్‌పై 9 టెస్టు సెంచరీలు చేసిన ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్‌ను వెనక్కు నెట్టి ముందంజలో జో రూట్ నిలిచాడు. అలాగే జో రూట్ 19 వేల పరుగుల క్లబ్ లోకి చేరాడు. 342 మ్యాచుల్లో జో రూట్ 19 వేల పరుగులు చేశాడు. జో రూట్ కంటే ముందు విరాట్ కోహ్లీ 399 మ్యాచులు, సచిన్ 432 మ్యాచులు, లారా 433 మ్యాచులు, రికీ పాంటింగ్ 444 మ్యాచుల్లో 19 వేల అంతర్జాతీయ పరుగులను సాధించారు.





Tags:    

Similar News