Asia Cup 2023 Ind vs Pak: మరికొన్ని గంటల్లో ఇండోపాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మ్యాచ్​కు గెట్ రెడీ..

Byline :  Veerendra Prasad
Update: 2023-09-02 03:16 GMT

ఆసియా కప్​లో.. అసలైన పోరుకు మ్యాచ్​కు రంగం సిద్ధమైంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత వన్డేల్లో భారత్‌.. పాకిస్థాన్‌ను ఢీ కొట్టనుంది. 2019 ప్రపంచకప్​లో ఈ రెండు జట్లు చివరిసారిగా తలపడగా.. ఆ తర్వాత ఇరుజట్ల మధ్య వన్డే మ్యాచ్‌ ఆడే ఛాన్స్​ రాలేదు. అప్పటి నుంచి భారత్-పాక్ 4 సార్లు మాత్రమే టీ20ల్లో ఎదురుపడ్డాయి. ఈ ఫార్మాట్​లో కూడా మ్యాచ్ జరిగి దాదాపు 10నెలలు కావస్తోంది. చివరగా 2022 టీ20 ప్రపంచకప్​లో ఇండో-పాక్ మ్యాచ్ జరిగింది. ఇక చాలా రోజుల తర్వాత ఈరోజు(సెప్టెంబర్ 2న) జరగబోయే.. దాయాదుల పోరును వీక్షించేందుకు యావత్ క్రీడాలోకం ఉత్సాహంగా ఉంది.

శనివారం, శ్రీలంకలోని పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియం(Pallekele Stadium in Srilanka) దాయాదుల పోరుకు వేదిక కానుంది. ఈ కప్‌లో భారత్ కు ఇది తొలి మ్యాచ్ కాగా, పాక్​కు రెండో మ్యాచ్. ఇరు జట్ల మధ్య జరిగే ఈ వన్డే మ్యాచ్(50 ఓవర్లు) మధ్యాహ్నం 3 గంటలకు మొదలుకానుంది. ఇప్పటికే క్రికెట్ అభిమానులు టికెట్లు బుక్ చేసుకుని మ్యాచ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

పాకిస్తాన్‌ను ఢీకొట్టే భారత జట్టు ఇదే: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

ఆసియా కప్‌లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్‌ను టీవీల్లో అయితే స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చు. అదే విధంగా మొబైల్స్‌లో చూడాలనుకునే వారు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో యాప్‌లో వీక్షించవచ్చు. అయితే మ్యాచ్​కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. వర్షం పడేందుకు 90 శాతం ఛాన్స్​ ఉందనీ.. వాతావరణంలో తేమ 84 శాతం ఉంటుందని శ్రీలంక వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఆసియా కప్‌లో కీలక మ్యాచ్​కు వర్షం ఆటంకం కలిగిస్తుందేమోనని క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.



Tags:    

Similar News