India vs West Indies: చివరి T20 లో భారత్ పరాజయం.. లక్ష్యాన్ని ఊదేసిన వెస్టిండీస్

Update: 2023-08-14 02:12 GMT

వెస్టిండీస్‌తో జరిగిన ఐదో టీ20లో భారత్ ఘోర పరాజయం పాలైంది.ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 165 పరుగులు సాధించింది. అనంతరం వెస్టిండీస్ 18 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకుంది. 2016 తర్వాత ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో విండీస్‌ చేతిలో ఓడిపోవడం భారత్‌కు ఇదే తొలిసారి కావడం గమనార్హం. వెస్టిండీస్ బ్యాటర్లలో బ్రాండన్ కింగ్ (85: 55 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్లు) అజేయ ఇన్నింగ్స్‌తో జట్టును విజయపథంలో నడిపించాడు.భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (61: 45 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) అర్థ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతనికి తిలక్ వర్మ (27: 18 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) చక్కటి సహకారం అందించాడు. వెస్టిండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్ నాలుగు వికెట్లు దక్కించుకున్నాడు.

ఆనందాన్ని ఎంతోసేపు నిలవనివ్వలేదు

166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ కైల్ మేయర్స్‌ను అర్ష్‌దీప్ సింగ్ అవుట్ చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో కైల్ మేయర్స్‌ను అర్ష్‌దీప్ బోల్తా కొట్టించడం ఇది నాలుగోసారి కావడం విశేషం. అయితే భారత్‌కు ఆరంభ ఆనందమే మిగిలింది. ఎందుకంటే మరో ఓపెనర్ బ్రాండన్ కింగ్, ప్రమోషన్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చిన నికోలస్ పూరన్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. కింగ్‌కు తోడైన పూరన్‌.. అవుట్ చేసిన ఆనందాన్ని ఎంతోసేపు నిలవనివ్వలేదు. భారత బౌలర్లను ఒక ఆటాడుకున్నారు. అక్కడక్కడా వర్షం అంతరాయం కలిగించినా వీరు ఎక్కడా తడబడలేదు. రెండో వికెట్‌కు 107 పరుగులు జోడించి మ్యాచ్‌ను భారత్ దగ్గర నుంచి లాగేసుకున్నారు.ఇన్నింగ్స్ 14వ ఓవర్లో తిలక్ వర్మ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత బ్రాండన్ కింగ్, షాయ్ హోప్ కలిసి మ్యాచ్‌ను ముగించారు. ఈ విజయంతో వెస్టిండీస్ సిరీస్‌ను కూడా విజయం సాధించింది.

సూర్య, తిలక్ మినహా...

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. నాలుగో టీ20లో శుభారంభం అందించిన శుభ్‌మన్ గిల్ (9: 9 బంతుల్లో, ఒక ఫోర్), యశస్వి జైస్వాల్ (5: 4 బంతుల్లో, ఒక ఫోర్) ఈ మ్యాచ్‌లో ఘోరంగా విఫలం అయ్యారు. వీరిద్దరినీ అకియల్ హొస్సేన్ అవుట్ చేశాడు. అయితే ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (61: 45 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు), తిలక్ వర్మ (27: 18 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. క్రమం తప్పకుండా వికెట్లు పడ్డా.. భారత్‌ వెస్టిండీస్ కు ఈ లక్ష్యాన్ని నిర్దేశించగలిగిందంటే అందుకు కారణం సూర్య కుమార్‌ కీలక ఇన్నింగ్సే. సూర్య సహకారంతో తిలక్ వర్మ కూడా ఎంతో వేగంగా ఆడాడు. మూడో వికెట్‌కు వీరు 49 పరుగులు సాధించారు. భాగస్వామ్యం బలపడుతున్న దశలో తిలక్ వర్మను రోస్టన్ ఛేజ్ రిటర్న్ క్యాచ్ ద్వారా అవుట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన వారెవరూ క్రీజులో నిలబడలేకపోయారు. కనీసం 15 పరుగులు కూడా చేయలేకపోయారు. అయినంత వరకు సూర్యకుమార్ యాదవ్ బాగా ఆడాడు. అర్థ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో జేసన్ హోల్డర్... సూర్యకుమార్ యాదవ్‌ను అవుట్ చేశాడు. దీంతో భారత జట్టు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.

Tags:    

Similar News