Asian Games 2023: పతకాల వేట.. ఫైనల్ చేరిన భారత్.. మరో మెడల్ పక్కా
చైనా వేదికపై జరుగుతున్న ఏషియన్ గేమ్స్ లో భారత్.. పతకాల వేట కొనసాగిస్తుంది. బుధవారం జరిగిన సెమీ ఫైనల్ లో భారత పురుషుల హాకీ జట్టు.. రిపబ్లిక్ ఆఫ్ కొరియాను ఓడించింది. 5-3తో కొరియాను చిత్తు చేసి ఫైనల్ లో అడుగుపెట్టింది. ఇక ఫైనల్ లో జపాన్ లేదా చైనాతో పోటీ పడి.. గెలిస్తే గోల్డ్, ఓడితే సిల్వర్ మెడల్ ను సొంతం చేసుకోనుంది. హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో భారత ప్లేయర్లు హార్దిక్ సింగ్ (5వ నిమిషం), మన్ దీప్ సింగ్ (11వ నిమిషం), లలిత్ కుమార్ ఉపాధ్యాయ (15వ నిమిషం), అమిత్ రోహిదాస్ (24వ నిమిషం), అభిషేక్ (54వ నిమిషం) గోల్స్ చేశారు. కొరియా తరుపున జంగ్ మాంజే ఒక్కడే (17, 20, 42వ నిమిషాల్లో) మూడు గోల్స్ చేశాడు. శుక్రవారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో భారత్ చైనా లేదా జపాన్ లతో తలపడనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ లో గెలిస్తే.. ఏషియన్ గేమ్స్ లో స్వర్ణ పతకం గెలిచిన భారత నాలుగవ పురుషుల జట్టుగా హర్మన్ ప్రీత్ సేన నిలుస్తుంది. అంతేకాకుండా 2024లో జరిగే ఒలంపిక్స్ కు నేరుగా అర్హత సాధిస్తుంది.