ఆ రోజే భారత్ జట్టు ఎంపిక..అయ్యర్ కష్టమే

Update: 2023-08-17 11:59 GMT

వరల్డ్‌కప్ ముందు భారత్‌కు ఆసియా కప్ ఆడనుంది. ఈ సిరీస్ టీమిండియాకు చాలా కీలకం. ఈ సిరీస్‌తోనే ప్రపంచకప్ ఆడే ఆటగాళ్లపై క్లారిటీ రానుంది. దీంతో ఆసియాకప్‌-2023లో పాల్గొనే భారత జట్టుపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆసియాకప్‌కు జట్టును ఎప్పుడు ప్రకటిస్తారు..ఎవరెవరికీ అవకాశం కల్పిస్తారు అన్న దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఆసియాకప్‌-2023లో పాల్గొనే భారత జట్టు ప్రకటనకు ముహూర్తం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఆగస్టు 20న జట్టును బీసీసీఐ ప్రకటించనున్నట్లు సమాచారం. అదే రోజు అగార్కర్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ సమావేశం అవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

గాయం కారణంగా జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఎంట్రీపై ఉత్కంఠ నెలకొంది. ప్రపంచకప్ ముందు వీరిద్దరు పునరాగమనం చేస్తారా లేదా అన్నదానిపై సస్పెన్షన్ కొనసాగుతోంది. అయితే కేఎల్ రాహుల్ జట్టులోకి వచ్చే అవకాశం ఉన్నా...అయ్యర్ మాత్రం ఆసియా కప్‌కు దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. వెన్నునొప్పికి ఆపరేషన్ చేసుకున్న అయ్యర్ ప్రస్తుతం ఏన్సీఏలో ఫిట్‌నెస్ సాధిస్తున్నాడు. అతడు పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం. అయ్యర్ స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌ను కొనసాగించాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీ20లో అదరగొడుతున్నసూర్యకుమార్, వన్డేల్లో మాత్రం అంచనాలను అందుకోలేకపోతున్నాడు.

ఆసియా కప్ ఆగస్టు 30న ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో టోర్నీ ముగుస్తుంది. టోర్నీలో అత్యంత ముఖ్యమైన భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ సెప్టెంబర్ 2న శ్రీలంకలోని క్యాండీ వేదిక‌గా జరగనుంది.


Tags:    

Similar News