India vs Australia: సెంచరీలు మిస్.. కోహ్లీ, రాహుల్‌కు అదొక్కటే బాధ..
వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ ఆడిన తొలి మ్యాచ్... క్రికెట్ ఫ్యాన్స్‌కు మాంఛి కిక్ ఇచ్చింది. మామూలు మ్యాచ్‌లకు, వరల్డ్ కప్ మ్యాచ్‌కు ఇదే తేడా అనేలా ఫస్ట్ ఓవర్ నుంచి చివరకు వరకూ ఉత్కంఠ రేకెత్తించేలా సాగింది. 2 పరుగుల వ్యవధిలో టాప్-3 వికెట్లు.. ముగ్గురు డకౌట్! ఇదేం బ్యాటింగ్ రా అయ్యా..! అనుకున్న వాళ్ల ఓపినియన్ అంతా 37 వ ఓవర్ వచ్చేసరికి ఒక్కసారిగా మారిపోయింది. 41 వ ఓవర్ లో పాండ్యా కొట్టిన సిక్సర్‌తో దటీజ్ ఇండియా అంటూ కాలర్ ఎగరేశారు. నిజంగా కూడా ఓటమి ఖాయమనుకున్న ఈ మ్యాచ్‌లో మనోళ్లు గొప్ప విజయంతో ప్రపంచకప్‌ను గ్రాండ్ గా స్టార్ట్ చేశారు. ఫస్ట్ మ్యాచే ఈ రేంజ్ లో ఉందంటే.. ఇక ముందు ముందు అదిరిపోయిద్దనుకుంటున్నారు ఫ్యాన్స్ .
చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. బౌలింగ్‌లో స్పిన్నర్లు సత్తా చాటగా.. బ్యాటింగ్‌లో చేజింగ్ కింగ్ విరాట్ కోహ్లీ, క్లాస్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సూపర్ బ్యాటింగ్‌తో జట్టుకు విజయాన్ని అందించారు. సమష్టిగా రాణించిన జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత ఆసీస్‌ను 199 పరుగులకే కట్టడి చేసిన భారత్.. ఛేజింగ్‌లో ఫస్ట్ 2 ఓవర్లలో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌లు 165 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు.
పీకల్లోతు కష్టాల్లో పడ్డ సమయంలో జట్టుకు అండగా నిలిచాడు కోహ్లీ . 12 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్ ను మిచెల్ మార్ష్ నేలపాలు చేయడంతో బతికిపోయిన కోహ్లీ. . ఆ తర్వాత విజృంభించాడు. తొలి రెండు ఓవర్ల తర్వాత స్టేడియం మొత్తం సైలెంట్ కాగా.. కోహ్లీ తన ఆటతో ఈలలు వేయించాడు. నిప్పులు చెరిగే బౌలింగ్ తో వికెట్లు తీస్తున్న హేజల్ వుడ్, స్టార్క్ లను అడ్డుకున్నాడు. మరో ఎండ్ లో ఉన్న కేఎల్ రాహుల్ కు స్ఫూర్తిగా నిలిచాడు. అయితే 85 పరుగులు చేసిన తర్వాత అవుటయ్యాడు కోహ్లీ. హాజిల్ వుడ్ బౌలింగ్ లో పుల్ షాట్ ఆడబోయి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో సెంచరీ కి మరో 15 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. సెంచరీ మిస్ చేసుకున్నానని బాధపడ్డాడు.
This was your 78th century King 💔#INDvAUS pic.twitter.com/z82OVwWiJR
— leisha (@katyxkohli17) October 8, 2023
మరోవైపు కేఎల్ రాహుల్ కూడా సూపర్ బ్యాటింగ్ తో మెరిశాడు. కానీ అతడి సెంచరీ కూడా మిస్ అయింది. విజయానికి 5 పరుగులు అవసరమైన స్థితిలో రాహుల్ 4, 6 కొడితే సెంచరీ పూర్తయ్యేది. కానీ కోహ్లీ స్థానంలో వచ్చిన పాండ్యా.. సిక్స్ కొట్టడంతో సెంచరీకి 3 పరుగుల దూరంలో ఆగిపోయాడు రాహుల్. మొత్తానికి 97 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ కు సూపర్ విక్టరీని అందించాడు.
Some 97 are superior to 100 #Gambhir Now Kl Rahul in the #WorldCup2023 game#ViratKohli #KLRahul #Jaddu#INDvAUS #Ashwin#CWC23 #Israel pic.twitter.com/AYTotIkjxU
— Lokesh Bagari (@Lucky32146133) October 8, 2023
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.3 ఓవర్లలో 199 పరుగులకు కుప్పకూలింది. స్టీవ్ స్మిత్(71 బంతుల్లో 5 ఫోర్లతో 46), డేవిడ్ వార్నర్(52 బంతుల్లో 6 ఫోర్లతో 41) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చివర్లో మిచెల్ స్టార్క్(35 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 28) విలువైన పరుగులు జోడించాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(3/28) మూడు వికెట్లుతీయగా.. కుల్దీప్ యాదవ్(2/42), జస్‌ప్రీత్ బుమ్రా(2/35) రెండేసి వికెట్లు తీసారు. మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 41.2 ఓవర్లలో 4 వికెట్లకు 201 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లీ(116 బంతుల్లో 6 ఫోర్లతో 85), కేఎల్ రాహుల్(115 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 97 నాటౌట్) చెలరేగారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్ మూడు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్ ఓ వికెట్ తీసాడు.