IND vs ENG : కాసేపట్లో టీమిండియా- ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్..
ఇవాళ్టి నుంచి విశాఖ వేదికగా టీమిండియా - ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ జరగనుంది. కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. 5 టెస్టుల సిరీస్ లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్లో గెలిచి దానిని సమం చేయాలని టీమిండియా పట్టుదలతో ఉంది. భారత్ విశాఖలో విజృంభిస్తుందా.. బజ్ బాల్కు చెక్ పెడుతుందా.. ఉప్పల్ టెస్టుకు ప్రతీకారం తీర్చుకుంటుందా అన్నది ఉత్కంఠగా మారింది. ఉప్పల్ టెస్టులో మొదట ఆధిపత్యం ప్రదర్శించిన రోహిత్ సేన.. చివరకు చేతులెత్తేసింది. ఈ మ్యాచ్లోనూ సత్తా చాటి సిరీస్ పై పట్టు సాధించాలని ఇంగ్లీష్ జట్టు ప్రణాళికలు వేస్తోంది.
భారత బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉన్నా... మొదటి టెస్ట్ మ్యాచ్లో ఒక్కరు కూడా సెంచరీ చేయలేకపోయారు. తొలి ఇన్నింగ్స్లో ముగ్గురు బ్యాటర్లు 80+, మరో ముగ్గురు బ్యాటర్లు 50+ పరుగులు మాత్రమే చేయగలిగారు. ఇక రెండో ఇన్నింగ్స్ లో ప్రతీ బ్యాటర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. తప్పిదాలతో మ్యాచ్ను ఇంగ్లాండ్కు ఇచ్చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఫెయిల్ అవ్వడం జట్టుకు మైనస్గా మారింది. ఇక శుభ్ మన్ గిల్ రెండు ఇన్నింగ్స్లలో దారుణంగా నిరాశపరిచాడు. ఫామ్ కోల్పోయి జట్టుకు భారంగా మారుతున్నాడు. శ్రేయస్ అయ్యర్ పర్వాలేదనిపించినా.. అతని తొందరపాటుతో ఔట్ అయిపోతున్నాడు. వీరు ఫామ్లోకి వస్తే.. భారత్కు తిరుగు ఉండదు.
మేటీ స్పిన్నర్లు
ప్రస్తుతం టీమిండియాలో ఉన్న ముగ్గురు స్పిన్నర్లు మేటి ఆటగాళ్లు. పైగా టెస్ట్ ఆల్ రౌండర్లు కూడా. అయినా.. లాభం లేకపోయింది. అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ లాంటి స్పిన్నర్లు సొంతగడ్డపై వికెట్లు తీయలేకపోవడం జట్టుకు ఇబ్బంది కలిగించే విషయమే. అశ్విన్ 29 ఓవర్లలో 3 వికెట్లు తీయగా, జడేజా 34ఓవర్లలో 2, 16 ఓవర్లు వేసిన అక్షర్ ఒక వికెట్ పడగొట్టాడు. బౌలింగ్ లోనే కాకుండా బ్యాటింగ్లో వీరు రాణించాల్సి ఉంది. ఇక రెండో ఇన్నింగ్స్లో మాత్రం దారుణంగా విఫలం అయ్యారు. వీళ్ల బౌలింగ్లో ఓలీ పోప్ అలవోకగా సిక్సర్లు బాదాడు. అదే పిచ్పై ఇంగ్లాండ్ స్పిన్నర్ టామ్ హార్ట్ లే చెలరేగి ఏడు వికెట్లు తీసుకున్నాడు.
కీలక ఆటగాళ్ల దూరం
ఇప్పటికే జట్టులో విరాట్ కోహ్లీ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మరో ఇద్దరు ఆటగాళ్లు జట్టుకు దూరం అయ్యారు. గాయాల కారణంగా కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా రెండో టెస్ట్ ఆడడం లేదు. కోహ్లీతో పాటు వీరిద్దరు కూడా దూరం కావడం జట్టు కూర్పు కష్టంగా మారింది. బ్యాటింగ్లో దేశవాళీలో రాణిస్తున్న రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్ ఉన్నారు. కానీ బౌలింగ్లో జడేజాకు రీప్లేస్గా ఎవరిని దింపుతారనేది ఉత్కంఠగా మారింది. ఇలాంటి ప్రతికూల అంశాలనుంచి టీమిండియా ఎలా బయటపడుతుంది? విశాఖ టెస్ట్ ఎలా గెలుస్తుందో చూడాలి.
టీమిండియా (అంచనా) : రోహిత్ శర్మ (సి), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, రజత్ పటీదార్, అక్షర్ పటేల్, కెఎస్ భరత్ (WK), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్/వాషింగ్టన్ సుందర్
ఇంగ్లాండ్ ( అంచనా ) : జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (c), బెన్ ఫోక్స్ (WK), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్