India vs England 4th Test: ఇంగ్లాండ్‌ vs భారత్‌: నేటి నుంచే నాలుగో టెస్టు

Byline :  Veerendra Prasad
Update: 2024-02-23 01:42 GMT

ఐదుటెస్టుల సిరీస్‌లో భాగంగా టీమిండియా నేడు ఇంగ్లండ్‌తో నాల్గవ టెస్టుకు సిద్ధమైంది. ఈ సిరీస్‌లో భారత్ ఇప్పటికే 2-1 ఆధిక్యంలో కొనసాగుతుండగా... రాంచి వేదికగా జరగబోయే 4 వ టెస్టులోనూ విజయం సాధించి సిరీస్‌ను చేజిక్కించుకోవాలని తహతహలాడుతోంది. మరోవైపు మూడో టెస్టులో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న ఇంగ్లండ్.. రాంచీలో గెలిచి సిరీస్‌ సమం చేయాలనే లక్ష్యంతో ఉంది.

ఈ సిరీస్‌లో ఇప్పటివరకు యువ బ్యాటర్లే సత్తా చాటారు. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ గత రెండు టెస్టుల్లోనూ రెండు డబుల్ సెంచరీలతో అదరగొడితే.. సర్ఫరాజ్‌ ఆరంగేట్ర టెస్టులోనే రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. ధ్రువ్‌ జురెల్‌ కూడా మంచి జోరు మీదుండగా.. గిల్‌ గాడినపడ్డాడు. పేలవ ఫామ్‌ నుంచి బయటపడుతూ ఇప్పటివరకు 42 సగటుతో 252 పరుగులు సాధించాడు. జట్టు ధీమా పెంచుతున్నది వీళ్ల పామే. కెప్టెన్‌ రోహిత్‌ కూడా గత మ్యాచ్‌లో సెంచరీతో జోరుందుకున్నాడు. ఈ బ్యాటర్లు మరోసారి చెలరేగాలని జట్టు ఆశిస్తోంది. కొత్త ఆటగాడు రజత్‌ పటీదార్‌ ఈసారైనా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడా అన్నది చూడాలి. ఇక బౌలింగ్ విషయంలో టీమ్‌ఇండియా ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతోనే బరిలోకి దిగనుంది. బుమ్రా స్థానాన్ని ఆకాశ్‌దీప్‌ భర్తీ చేస్తుండగా.. ఈ మ్యాచ్ లో సిరాజ్ ఎక్స్‌పిరయన్స్‌డ్ ఫాస్ట్‌బౌలర్‌. అశ్విన్‌, జడేజా, కుల్‌దీప్‌ లు స్పిన్‌ బాధ్యతలు చూసుకోనున్నారు.

రాంచీ టెస్టుకు జట్టులో రెండు మార్పులతో బరిలోకి దిగనుంది ఇంగ్లండ్. ఫాస్టెస్ట్‌ పేసర్‌ మార్క్‌వుడ్‌ను పక్కన పెట్టిన ఇంగ్లాండ్‌ బోర్డు ఓలీ రాబిన్‌సన్‌ను జట్టులోకి తీసుకుంది. మూడో టెస్టులో బెంచ్‌కే పరిమితమైన షోయబ్‌ బషీర్‌ ఈ సారి జట్టులోకి వచ్చాడు.సీనియర్‌ జేమ్స్‌ అండర్సన్‌కు మరోసారి అవకాశం దక్కింది. స్పిన్‌ పిచ్‌లపై రాణించలేకపోయిన రెహాన్‌ అహ్మద్‌ను పక్కన పెట్టారు. పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా ఉంటుందనే విశ్లేషణల నేపథ్యంలో.. ఇంగ్లాండ్‌ మాత్రం ఇద్దరు స్పెషలిస్ట్‌ స్పిన్నర్లతోనే బరిలోకి దిగడం గమనార్హం.

తుది జట్లు

భారత్‌ (అంచనా): రోహిత్‌ (కెప్టెన్), జైస్వాల్, శుబ్‌మన్‌ గిల్, పటిదార్, సర్ఫరాజ్, ధ్రువ్‌ జురెల్, జడేజా, అశ్విన్, సిరాజ్, కుల్దీప్, ముకేశ్‌/ఆకాశ్‌దీప్‌.

ఇంగ్లండ్‌: బెన్ స్టోక్స్ (కెప్టెన్‌), జాక్ క్రాలీ, డకెట్‌, జో రూట్, జానీ బెయిర్‌స్టో, షోయబ్ బషీర్‌, బెన్‌ ఫోక్స్ (వికెట్ కీపర్), టామ్ హర్ట్‌లీ, ఓలీ పోప్‌, ఓలీ రాబిన్‌సన్‌, జేమ్స్ అండర్సన్‌.

పిచ్‌, వాతావరణం

గత మూడు మ్యాచ్‌లు జరిగిన వేదికలతో పోల్చుకుంటే.. రాంచీ పిచ్‌ భిన్నంగా ఉండనుంది. స్పిన్‌కు సహకరించే అవకాశలెక్కువ. పిచ్‌పై పగుళ్లు ఉన్నాయి. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు.

స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ఉదయం గం. 9:30 నుంచి స్పోర్ట్స్‌–18, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం  

Tags:    

Similar News