IND vs PAK tickets: భారత్ - పాక్ పోరు.. గంటలోనే అయిపోయిన టికెట్లు..

Byline :  Krishna
Update: 2023-08-30 08:28 GMT

భారత్.. బంగాదేశ్తో ఆడితే ఏముంటుంది.. పాకిస్తాన్తో ఆడితేనే మజా.. ఇది ఓ సినిమాలోని డైలాగ్. క్రికెట్లో భారత్ - పాక్ మ్యాచ్కు ఉండే క్రేజ్ మామూలుగా ఉండదు. ఈ మ్యాచును చూసేందుకు అభిమానులు పోటీ పడతారు. టికెట్ల కోసం ఎంత ఖర్చు చేయడానికైనా సిద్ధపడతారు. ఇక అక్టోబర్ 5నుంచి భారత్లో వరల్డ్ కప్ జరగనుంది. ఇందులో భాగంగా అక్టోబర్ 14న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ - పాక్ జరుగనుంది. ఈ మ్యాచ్ టికెట్లు గంటలోపే అయిపోవడం క్రికెట్ ఫ్యాన్స్ను నిరాశకు గురిచేసింది.

భారత్ - పాక్ మ్యాచ్‌కు సంబంధించి కొన్ని టికెట్లను బీసీసీఐ మంగళవారం సాయంత్రం బుక్ మై షో ద్వారా అందుబాటులోకి తెచ్చింది. ఒక్కో వ్యక్తికి రెండు టికెట్లు అమ్మింది. కేవలం గంట వ్యవధిలోనే సోల్డ్‌ ఔట్‌ అని కనిపించడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. బీసీసీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదొక స్కాం.. ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ కోసం ఇంతటి చెత్త టికెట్‌ బుకింగ్‌ సిస్టమ్‌ను చూడలేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. రెండు గంటలు వేచి ఉన్నా ఒక్క టికెట్ బుక్ కాలేదు అని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో బీసీసీఐ స్పందించింది. మంగళవారం కొన్ని టికెట్లను మాత్రమే అందుబాటులో ఉంచామని చెప్పింది. సెప్టెంబర్‌ 3న మరో సేల్‌ ఉంటుందని స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు ఎన్ని టికెట్లను అందుబాటులో ఉంచారో బయటకు చెప్పాలని క్రికెట్ ఫ్యాన్స్‌ డిమాండ్ చేస్తున్నారు. బీసీసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Tags:    

Similar News