ఇవాళ్టి నుంచి భారత్ - సౌతాఫ్రికా మధ్య ఫస్ట్ టెస్ట్

Byline :  Krishna
Update: 2023-12-26 02:13 GMT

సౌతాఫ్రికా గడ్డపై చరిత్ర సృష్టించేందుకు టీమిండియా సిద్ధమైంది. ఇవాళ సౌతాఫ్రికా - ఇండియా మధ్య ఫస్ట్ టెస్ట్ జరగనుంది. సెంచూరియన్ వేదికగా మధ్యాహ్నాం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. కాగా గత మూడు దశాబ్దాలుగా సఫారీ గడ్డపై టెస్ట్ సీరీస్ నెగ్గని టీమిండియా.. ఈసారి రోహిత్ కెప్టెన్సీలో గెలవాలని పట్టుదలతో ఉంది. ఈ సిరీస్లో అందరి దృష్టి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపైనే ఉంది. రోహిత్, కోహ్లిల ప్రదర్శనపై జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత రెస్ట్ తీసుకుని జట్టుకు దూరంగా ఉన్న వీరిద్దరు.. ఈ టెస్ట్ సిరీస్ ద్వారా జట్టులోకి ఎంట్రీ ఇస్తున్నారు.

అంతేకాకుండా భారత్ దాదాపు 5 నెలల తర్వాత టెస్ట్ ఫార్మట్ ఆడుతుంది. భారత జట్టు చివరి సారిగా గత జూలైలో వెస్టిండీస్‌ గడ్డపై సిరీస్‌ ఆడగా.. సఫారీ టీం గత మార్చిలో విండీస్‌తో తలపడింది. బలాబలాలను బట్టి చూస్తే ఇరు జట్లూ సమ ఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. ఇక టీమిండియా టెస్టు క్రికెట్‌ విజయాల్లో కీలకంగా ఉన్న పుజారా, రహానే తుది జట్టులో లేకుండా విదేశీ గడ్డపై టెస్టు ఆడి 12 ఏళ్లు అయింది. 2012 జనవరిలో అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ తర్వాత వీరిద్దరూ లేకుండా విదేశాల్లో టెస్టు ఆడలేదు. వరల్డ్‌కప్‌లో అదరగొట్టిన షమీ లేకపోవడం జట్టుకు పెద్ద లోటే. అతని స్థానంలో మూడో పేసర్‌గా ప్రసిధ్, ముకేశ్‌లలో ఒకరికి చాన్స్‌ లభించనుంది.

ఈ క్రమంలో రోహిత్ శర్మ తన ఆటతీరు మార్చుకోవాలని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించారు. ప్రస్తుతం రోహిత్ మైండ్ సెట్ దూకుడుగా ఉంది. టీ20, వన్డే వరల్డ్ కప్ లో అదే చూశాం. సౌతాఫ్రికాతో ఆడబోయేది టెస్టు సిరీస్కు అనుగుణంగా ఓపికగా ఆడాలి. తొలిరోజు ముగిసేవరకూ రోహిత్ క్రీజులో ఉంటే అతడి స్కోరు 150 ప్లస్, టీమ్ స్కోరు 300 ప్లస్గా ఉంటుందని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

భారత్‌ జట్టు : రోహిత్ శర్మ (c), శుభ్‌మన్ గిల్, యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, కేఎస్ భరత్ , కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముకేశ్‌ కుమార్, జస్‌ప్రిత్ బుమ్రా (v/c), ప్రసిద్ధ్ కృష్ణ.

Tags:    

Similar News