ఇవాళ భారత్ -వెస్టిండీస్ మధ్య చివరి వన్డే.. గెలిచినవాళ్లదే సిరీస్..
ఇవాళ భారత్ - వెస్టిండీస్ మధ్య చివరి వన్డే జరగనుంది. సాయంత్రం 7గంటలకు ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వాళ్లదే సిరీస్. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమం కావడంతో మూడో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. దీంతో ఎలాగైనా మ్యాచ్ గెలవాలని ఇరుజట్లు తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.
మూడు వన్డేల సిరీస్లో భాగంగా.. మొదటి మ్యాచ్లో గెలిచిన టీమిండియా రెండో మ్యాచ్లో ఓడిపోయింది. దీంతో ఈ మ్యాచ్ ఎట్టిపరిస్థితిలోనూ గెలవాల్సిందే. రెండో మ్యాచ్కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు రెస్ట్ ఇచ్చారు. ఈ నిర్ణయాత్మక మ్యాచ్లో రోహిత్ ఆడే అవకాశం ఉంది. రెండో మ్యాచ్లో ఓటమి ఎదురవడంతో మూడో వన్డేలో రోహిత్ను ఆడించాలని టీం మేనేజ్మెంట్ భావిస్తోంది.
కోహ్లీ దూరం..
కోహ్లీ మాత్రం ఈ మ్యాచ్కు దూరంగా ఉండే అవకాశం ఉంది. ట్రినిడాడ్‌కు అతడు టీమిండియా జట్టుతో కలిసి వెళ్లలేదని తెలుస్తోంది. దీంతో అతడు ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ మ్యాచ్ సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ కు కీలకం కానుంది. గత మ్యాచ్ లో వారిద్దరూ విఫలమవడంతో మరోసారి వారికి అవకాశం ఇవ్వాలని మేనేజ్ మెంట్ అనుకుంటోంది.
పరువు కోసం విండీస్..
వరల్డ్ కప్కు అర్హత సాధించలేని విండీస్.. టీమిండియాపై సరీస్ నెగ్గి పరువు కాపాడుకోవాలని చూస్తోంది. తొలి వన్డేలో ఓడిన తర్వాత గొప్పగా పుంజుకున్న వెస్టిండీస్.. రెండో మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అదే ఊపులో ట్రోఫీ సొంతం చేసుకోవాలని చూస్తోంది. అయితే ఈ సిరీస్ నెగ్గి వరల్డ్ కప్కు ముందు తమ సత్తా చాటాలని భారత్ భావిస్తోంది. ఈ క్రమంలో ఇరుజట్లకు మూడో వన్డే ఉత్కంఠగా మారింది.