కొలంబోలో భారత్- పాకిస్తాన్ మధ్య జరుగుతున్న సూపర్ 4 మ్యాచులో టీమిండియా ఆటగాళ్లు రెచ్చిపోయారు. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించి పాకిస్తాన్ పనిపట్టారు. భీకర ఫామ్ లో ఉన్న పాక్ టీంపై.. పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించారు. దీంతో పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. భారత్ నిర్దేశించిన 357 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 10 ఓవర్లలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (9), కెప్టెన్ బాబర్ ఆజమ్ (10) తొందరగా ఔట్ అయ్యారు. తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ కూడా వరుసగా పెవిలియన్ బాటపట్టారు.
మరో ఓపెనర్ ఫరక్ జమాన్ (27), రిజ్వాన్ (2), సల్మాన్ (23), షాదబ్ ఖాన్ (6), ఇఫ్తికార్ అహ్మద్ (23) భారత్ బౌలర్ల దాటికి తోకముడిచారు. భారత్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 5 కీలక వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, హార్దిక్, శార్దూల్ చెరో వికెట్ తీసుకున్నారు. దాంతో పాక్ 30 ఓవర్లకే 8 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. 228 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించి, సూపర్ 4ను ఘనంగా ఆరంభించింది. రౌఫ్ కు గాయం కావడంతో బ్యాటింగ్ కు రాలేదు. దాంతో భారత్ కు 8 వికెట్లకే గెలుపు దక్కింది. టీమిండియా ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ (122 నాటౌట్), కేఎల్ రాహుల్ (111 నాటౌట్) సెంచరీలతో చెలరేగారు. ఓపెనర్లు రోహిత్ శర్మ (56), గిల్ (58) శుభారంభాన్ని అందించారు.