భారత ఫుట్ బాల్ కు బ్లాక్ డే. భారత ఫుట్ బాల్ దిగ్గజం, హైదరబాదీ ప్లేయర్ మహ్మద్ హబీబ్ (74) కన్నుమూశారు. గత కొన్ని సంవత్సరాలుగా డిమెన్షియా, పార్కిన్‌సన్స్ సిండ్రోమ్ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం (ఆగస్ట్ 15) స్వస్థలంలోనే తుదిశ్వాస విడిచారు. 1949 జులై1న జన్మించిన హబీబ్.. 1965లో భారత్ తరుపున అరంగేట్రం చేశారు. 1965 నుంచి 1976 వరకు భారత ఫుట్ బాల్ టీంలో కీలక పాత్ర పోషించారు. 1970లో బ్యాంకాక్ వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో మరో హైదరబాదీ ఆటగాడు సయ్యద్ నయూముద్దీన్ కెప్టెన్సీలో ఆడిన హబీబ్.. ఆ టోర్నీలో కాంస్య పతకం సాధించారు. తన కెరీర్ కు గుడ్ బై చెప్పిన తర్వాత భారత ఫుట్ బాల్ టీంకు కోచ్ గా కూడా పనిచేశారు. హబీబ్ కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.