గోల్డ్ జస్ట్ మిస్..వరల్డ్‌కప్ షూటింగ్లో సిల్వర్ సాధించిన నిశ్చల్
వరల్డ్‌కప్ మహిళల విభాగంలో భారత యువ షూటర్ 19ఏళ్ల నిశ్చల్ సిల్వర్ మెడల్ సాధించింది. 50మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌లో ఆమె ఈ పతకాన్ని గెలుచుకుంది. దీంతో సోమవారం టోర్నీ ముగింపు రోజున ఆమె భారత్‌కు రెండో పతకాన్ని అందించింది. ఇది ఆమె మొదటి సీనియర్ ప్రపంచ కప్ ప్రదర్శన కావడంతో ఆమె సాధించిన విజయం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ గేమ్‌లో నార్వే షూటర్ జానెట్ హెగ్ డుసాడ్ స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్ ఈవెంట్‌లో నిశ్చల్ 458 పాయింట్లను స్కోర్ చేసింది.
రియోలో జరిగిన ISSF ప్రపంచకప్‌లో మహిళల 50మీ రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌లో భారత యంగ్ షూటర్ నిశ్చల్ రజతం గెలుచుకున్నది. ఈ 50మీటర్ల రైఫిల్ ఈవెంట్‌లో నార్వే షూటర్ జానెట్ హెగ్ డుసాడ్ స్వర్ణాన్ని సాధించింది. ఫైనల్ ఈవెంట్‌లో ఇండియన్ షూటర్ నిశ్చల్ 458 పాయింట్లను స్కోర్ చేసి ఇవాళ టాప్ ఫామ్ కనబరిచింది. అంతే కాదు మహిళల 3పీ ఈవెంట్‌లో ఆమె జాతీయ క్వాలిఫైయింగ్ రికార్డును బ్రేక్ చేసింది.
ఈ ప్రపంచకప్ ఈవెంట్‌లో మొత్తం 16 మంది భారత షూటర్లు పాల్గొన్నారు. గురువారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన 2018 ఆసియా క్రీడల ఛాంపియన్ సౌరభ్ చౌదరి ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. అనంతరం శనివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో ఎలవెనిల్ వలరివన్ స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. నిశ్చల్ సాధించిన సిల్వర్ మెడల్‌తో భారత్ ఈ ప్రపంచకప్‌లో రెండు పతకాలను గెలుచుకున్నట్లైంది.