Yashaswi Jaiswal : జైస్వాల్కు అన్యాయం.. 200 కొట్టినా! ఇలా చేయడం బీసీసీఐకి కొత్తేం కాదు
టీమిండియా యంగ్ సెన్సేషన్ యశస్వి జైశ్వాల్.. తన అద్భుతమైన ఆట తీరుతో డబుల్ సెంచరీ సాధించాడు. స్వదేశంలో ఇంగ్లండ్‍తో జరుగుతున్న టెస్టు సిరీసుల్లో విజృంభిస్తున్నాడు. రెండో టెస్టులో డబుల్ సెంచరీతో ఇంగ్లాండ్ దుమ్మురేపిన జైస్వాల్.. ప్రస్తుతం జరుగుతున్న మూడో మ్యాచ్‍లోనూ డబుల్ సెంచరీలతో చెలరేగాడు. ఇంగ్లండ్‍తో రాజ్‍కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టులో.. నాలుగో రోజు టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 231బంతుల్లో డబుల్ సెంచరీ 200 బాదాడు. కాగా టెస్టుల్లో అతనికిది నాలుగో శతకం. సొంత గడ్డపై ఒక సిరీస్‌లో 500+ రన్స్ చేసిన రెండో భారత బ్యాటర్ జైస్వాల్ గా నిలిచాడు. ఒక సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక సిక్స్‌లు (20) కొట్టిన ఆటగాడిగా, అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో చోటు సంపాదించాడు.
అయితే అతను ఎంత కష్టపడినా ఫలితం మాత్రం దక్కడం లేదు. ఈ టెస్టు సిరీస్ లో వరుస మ్యాచుల్లో డబుల్ సెంచరీ బాదినా గుర్తింపు రావడం లేదు. రెండు మ్యాచుల్లో భారత్ గెలుపుకు కారణమైన వ్యక్తికి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కలేదు. వైజాగ్ టెస్టులో బుమ్రాకు, రాజ్ కోట్ మ్యాచ్ లో జడేజాకు ఆ అవార్డులు దక్కాయి. దీంతో జైస్వాల్ ను బీసీసీఐ చిన్నచూపు చూస్తుందని, తనకు అన్యాయం జరుగుతుందని సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో జడేజా (112) సెంచరీ చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు రాకపోయినా బంతితో ఆకట్టుకున్నాడు. దానికి అతనికి మ్యాచ్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ వచ్చింది. రెండో టెస్టు మ్యాచులో జైస్వాల్ బ్యాటింగ్ తీరుపై మాజీలు ప్రశంసలు కురిపించారు. ఒకపక్క సహచర బ్యాటర్లంతా పెవిలియన్ కు క్యూ కడుతున్నా.. 290 బంతుల్లో 209 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఒక రకంగా జైస్వాల్ కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కు అర్హుడే. అయితే ఈ మ్యాచ్ లో ఆరు వికెట్లు తీసిన బుమ్రాకు ఈ అవార్డ్ వచ్చింది. దీంతో క్రికెట్ అభిమానులు జైస్వాల్ కు అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై మేనేజ్మెంట్ స్పందన ఎలా ఉంటదో వేచి చూడాలి.