IND vs AFG: టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం

Byline :  Bharath
Update: 2024-01-15 01:19 GMT

యశస్వి జైశ్వాల్‌, శివమ్‌ దూబె ఇండోర్‌లో ఇరగదీశారు. కళ్లు చెదిరే బ్యాటింగ్‌తో అఫ్ఘనిస్థాన్‌ కు చెమటలు పట్టించారు. ఫోర్లు.. సిక్సర్లు బాదుతూ.. ఆఫ్ఘాన్ బౌలింగ్ ను చితకబాదారు. ఫలితంగా రెండో టీ20లో అఫ్ఘనిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్.. మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. తన స్పిన్‌ మాయాజాలంతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన అక్షర్‌ పటేల్‌ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఆఫ్ఘాన్ నిర్దేశించిన 173 పరుగుల టార్గెట్ ను భారత్ కేవలం 15.4 ఓవర్లలోనే చేదించేసింది. యశస్వి జైశ్వాల్‌ (68, 34 బంతుల్లో 5×4, 6×6), శివమ్‌ దూబె (63 నాటౌట్‌, 32 బంతుల్లో 5×4, 4×6) విధ్వంసక బ్యాటింగ్‌తో విరుచుకుపడడంతో.. టీమిండియా ఈజీగా లక్ష్యాన్ని చేరుకుంది.

6 వికెట్ల తేడాతో ఆఫ్ఘాన్ ను మట్టికరిపించింది. కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి నిరాశ పరిచాడు. తన 150 టీ20 మ్యాచ్ లో గోల్డెన్ డక్ అయి పెవిలియన్ చేరాడు. 14 నెలల తర్వాత టీ20 ఫార్మట్ ఆడిన విరాట్ కోహ్లీ (29, 16 బంతుల్లో 5×4) చెలరేగాడు. చివర్లో రింకూ సింగ్ (9) భారత్ ను విజయ తీరానికి చేర్చాడు. ఆఫ్ఘాన్ బౌలర్లలో కరీం జనత్ 2, ఫరూకీ, నవీన్ ఉల్ హక్ చెరో వికెట్ పడగొట్టారు.

ఇక అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్.. బ్యాటర్లు కూడా రెచ్చిపోయారు. సిక్సర్లు, ఫోర్లు బాదుతూ స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆఫ్ఘాన్ 172 పరుగులు చేసి ఆలౌట్ అయింది. వచ్చిన ప్రతీ బ్యాటర్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓపెనర్ రహ్మానుల్లా (14, 9 బంతుల్లో), నబీ (14), నజీబుల్లా (23) రాణించారు. గుల్బాద్దీన్ నైబ్ (57) పరుగులతో సత్తా చాటాడు. చివర్లో కరీం జనత్ (20, 10 బంతుల్లో), ముజీబ్ ఉర్ రహ్మాన్ (21, 9 బంతుల్లో) చెలరేగారు. దీంతో ఆఫ్ఘాన్ స్కోర్ 172 పరుగులు చేరుకుంది. మరో ఓపెనర్ ఇబ్రహీం (8), అజ్మతుల్లా (2) నిరాశ పరిచారు. కాగా టీమిండియా బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీయగా.. రవీ బిష్ణోయ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. శివమ్ దూబెకు ఒక వికెట్ దక్కింది.




Tags:    

Similar News