చివరి టెస్ట్ సిరీస్ లో ఎల్గర్ రెచ్చిపోవడంతో సౌతాఫ్రికాకు భారీ ఆధిక్యం లభించింది. బెడింగ్ హామ్ (56), మార్కో జాన్సన్ (84) రాణించడంతో సఫారీ సేన మూడోరోజు ఆలౌట్ అయి.. 408 పరుగులు చేసి, 163 పరుగుల ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఓపెనర్ ఎల్గర్ (185) టీమిండియా బౌలర్లపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. చివర్లో మార్కో జాన్సన్ కూడా హాఫ్ సెంచరీ చేసి భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. సౌతాఫ్రికా వికెట్లను తీయడానికి భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. కాగా బుమ్రా 4 వికెట్లు తీసుకోగా... సిరాజ్ 2, శార్దూల్, అశ్విన్, ప్రసిద్ధ్ చెరో వికెట్ పడగొట్టారు.
లంచ్ బ్రేక్ తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆధిక్యంలో ఉన్న సౌతాఫ్రికాకు కౌంటర్ అటాక్ ఇస్తారనుకున్న మన ఓపెనర్లు రోహిత్ శర్మ డకౌట్ కాగా... యశస్వీ జైశ్వాల్ (5) మరోసారి నిరాశ పరిచారు. రబాడా, బర్గర్ చెరో వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం క్రీజులో శుభ్ మన్ గిల్ (13 నాటౌట్), విరాట్ కోహ్లీ (0 నాటౌట్) ఉన్నారు. వికెట్లు ఇలానే కొనసాగితే.. ఒక ఇన్నింగ్స్, మరో రోజు మిగిలి ఉండగానే సౌతాఫ్రికా గెలిచినా ఆశ్చర్యపోనవసరం లేదు.