WWE Tournament : రేపు హైదరాబాద్కు జాన్ సీనా.. వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్

Byline :  Kiran
Update: 2023-09-07 13:13 GMT

హైదరాబాద్ వేదికగా తొలిసారి WWE రెజ్లింగ్ టోర్నమెంట్ జరగనుంది. ఈ మెగా ఈవెంట్ కోసం నగరవాసులతో పాటు డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మెగా టోర్నీలో పాల్గొనేందుకు స్టార్ రెజ్లర్ జాన్ సీనా 17 ఏళ్ల తర్వాత ఇండియాకు వస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించారు. దీంతో జాన్ సీనా అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.

శుక్రవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం వేదికగా డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ స్పెక్టేకిల్ షో జరగనుంది. గతంలో 2017లో ఒకసారి భారత్ వేదికగా డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్ జరిగింది. ఆ తర్వాత మళ్లీ భారత్‌లో ఈ ఈవెంట్ జరగడం ఇదే తొలిసారి. ఈ సూపర్ స్పెక్టేకిల్‌లో పాల్గొంటున్నట్లు జాన్ సీనా ట్వీట్ చేశాడు. డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యామిలీని కలిసేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నానంటూ పోస్టు చేశాడు.

"స్మాక్‌డౌన్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యామిలీని కలిసేందుకు ఆగలేకపోతున్నా. ముఖ్యంగా భారత్‌లోని డబ్ల్యూడబ్ల్యూఈ యూనివర్స్‌ను కలిసేందుకు.. అక్కడ రెజ్లింగ్ చేసేందుకు చాలా ఎగ్జైట్ అవుతున్నా. దానికి ఇదే సరైన సమయం. త్వరలోనే అందర్నీ కలుస్తా' అంటూ జాన్ సీనా చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

WWE ఈవెంట్లో మొత్తం 28 మంది ఇంటర్నేషనల్ రెజ్లింగ్ ఛాంపియన్స్ పోటీ పడనున్నారు. ఈ ఈవెంట్ కు సంబంధించి రూ.500 నుంచి రూ.17 వేల వరకు టికెట్ రేట్లు ఫిక్స్ చేయగా.. నెలరోజుల ముందే అవన్నీ సోల్డ్ ఔట్ కావడం విశేషం.

Tags:    

Similar News