విజృంభించిన భారత స్పిన్నర్లు.. 218 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్

Byline :  Shabarish
Update: 2024-03-07 10:15 GMT

నేడు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ధర్మశాలలో ఐదో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు విజృంభించారు. కుల్దీప్ యాదవ్ స్పిన్ మాయాజాలంలో 5 వికెట్లు పడ్డాయి. దీంతో భారత్ స్పిన్నర్ల దెబ్బకు ఇంగ్లండ్ బ్యాటర్లు 218 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. భారత స్పిన్నర్లకు ధర్మశాల పిచ్ సెట్ అయినట్లు ఉంది. అందుకే వికెట్ల మీద వికెట్లు పడగొట్టారు. ఇకపోతే ఈ టెస్ట్ మ్యాచ్‌తో కెరీర్‌లోనే వందో టెస్టును అశ్విన్ ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు.

కుల్దీప్ యాదవ్ లెగ్ బ్రేక్, గూగ్లీలతో ఇంగ్లండ్ బ్యాటర్లను వణికించాడు. బెన్ డక్లెట్‌ను 27 పరుగులకు, ఓలీ పోప్‌ను 11 పరుగులకు కుల్దీప్ వెనక్కి పంపాడు. ఇకపోతే ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే 79 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లంచ్ బ్రేక్ తర్వాత ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ బ్యాటర్ క్రాలేను సూపర్ డెలివరీతో బౌల్డ్ చేశాడు. జానీ బెయిర్‌స్టో 29 పరుగులకు ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బెన్ స్టోక్స్‌ను డకౌట్ చేశాడు. దీంతో కుల్దీప్ తన ఖాతాలో 5 వికెట్లు వేసుకున్నాడు.

జో రూట్‌ను 26 పరుగులకు జడేజా పెవిలియన్‌కు పంపించాడు. ఆ తర్వాత టామ్ హార్ట్ల్ 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మార్క్ వుడ్ డకౌట్ అయ్యాడు. దీంతో 194 పరుగులకే ఇంగ్లండ్ జట్టు 8 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత అశ్విన్ స్పిన్ మాయాజాలంలో మరో రెండు వికెట్లు పడ్డాయి. దీంతో ఇంగ్లండ్ జట్టు 218 పరుగులకే ఆలౌట్ అయ్యింది.


Tags:    

Similar News