స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ లియొనెల్ మెస్సి.. పారిస్ సెయింట్ జెర్మన్ (PSG) జట్టును వీడారు. గత కొంతకాలంగా క్లబ్ యాజమాన్యంతో విబేధాలు.. అక్కడి అభిమానుల నుంచి విమర్శల నేపథ్యంలో.. జట్టుతో తన రెండేళ్ల బంధానికి గుడ్ బై చెప్పాడు. ఆదివారం PSG సొంత మైదానం పార్క్ ది ప్రిన్సెస్ స్టేడియంలో క్లెర్మాంట్‌తో జరిగిన మ్యాచే అతనికి ఆఖరిది. ఈ మ్యాచ్‌లో PSG 2-3తో ఓడింది. ఆఖరి మ్యాచ్‌లోనూ గోల్ కొట్టేందుకు అతను తీవ్రంగా ప్రయత్నించినా సఫలం కాలేకపోయాడు. మ్యాచ్ ముగిశాక సహచర ఆటగాళ్లను హత్తుకున్న అతను.. ప్రత్యర్థి ఆటగాళ్లతో చేతులు కలిపాడు.
‘‘ఈ రెండేళ్ల పాటు ఆడే అవకాశం కల్పించిన క్లబ్‌కు, పారిస్‌కు, ఇక్కడి ప్రజలకు ధన్యవాదాలు. భవిష్యత్‌లో ఈ క్లబ్ మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’’ అని మెస్సి పేర్కొన్నాడు. 2021 ఆగస్టులో ఛాంపియన్స్ లీగ్ టైటిల్ గెలవాలనే లక్ష్యంతో.. పీఎస్జీ మెస్సితో కాంట్రాక్ట్ చేసుకుంది. కానీ ఆ ఆశ తీరలేదు. ఫ్రెంచ్ లీగ్ పరిస్థితులకు అలవాటు పడేందుకు ఇబ్బంది పడ్డ మెస్సి.. PSG తరపున తొలి 26 మ్యాచ్‌ల్లో 6 లీగ్ గోల్స్ మాత్రమే చేశాడు. ఆ తర్వాత 32 గోల్స్ చేయడంతో పాటు 35 గోల్స్‌లో సాయపడ్డాడు. జట్టుకు రెండు ఫ్రెంచ్ లీగ్ టైటిళ్లు, ఓ ఫ్రెంఛ్ ఛాంపియన్ ట్రోఫీ అందించాడు. తమ అనుమతి లేకుండా సౌదీ అరేబియా వెళ్లాడని మెస్సీని క్లబ్ సస్సెండ్ చేసింది. అతను సౌదీ అరేబియాకు చెందిన ఓ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.
నిన్న జరిగిన మ్యాచ్ ఆరంభానికి ముందు గ్రౌండ్ లో కామెంటేటర్.. మెస్సి పేరు చెప్పగానే స్టాండ్స్‌లోని అభిమానులు అతణ్ని అగౌరవపరిచేలా అరిచారు. అదేం పట్టించుకోని మెస్సి.. తన ముగ్గురు పిల్లల చేతులు పట్టుకుని చిరునవ్వుతో మైదానంలో అడుగుపెట్టాడు.