Maxwell: 40 ఏళ్లు పట్టింది.. కపిల్ దేవ్ను గుర్తుచేసిన మ్యాక్స్వెల్
అది 1983 వరల్డ్ కప్.. టీమిండియా, జింబాబ్వే మధ్యలో అమీతుమీ పోరు. ఆ మ్యాచ్ ను భారత అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. కీలక సమయంలో భారత్ 17 పరుగులకే 5 వికెట్లు.. 78 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత ఓటమి ఖాయం అనుకున్న టైంలో.. క్రీజులోకి అప్పుడొచ్చాడు కెప్టెన్ కపిల్ దేవ్. తన అసాధారణ ఇన్నింగ్స్ 175 పరుగులు, 138 బంతుల్లో, 6 సిక్సర్లు.. 16 ఫోర్లు బాధి.. భారత స్కోర్ ను 260కి చేర్చి విజయాన్ని అందించాడు. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో కపిల్ దేవ్ పోరాట స్పూర్తి క్రికెట్ చరిత్రలోనే చిరకాలం నిలిచిపోయింది. ఆ ఇన్నింగ్స్ కు 40 ఏళ్లైనా.. ఇప్పటికీ మాట్లాడుకుంటారు. అలాంటి ఇన్నింగ్స్ మరొకటి రాదు అంటూ అవర్ణిస్తారు. కానీ, నిన్న మ్యాక్స్ వెల్ ఆడిన ఇన్నింగ్స్ తో.. మరోసారి అందరినీ మైమరపించాడు. కపిల్ దేవ్ ఇన్నింగ్స్ తర్వాత.. అంతటి గొప్ప ఇన్నింగ్స్ ఆడాడని మ్యాక్స్ వెల్ ను పొగుడుతున్నారు.
ఆసీస్ కు సెమీస్ కు వెళ్లాలంటే కీలక మ్యాచ్. ముందు ఆఫ్ఘనిస్తాన్ విధించిన 291 భారీ టార్గెట్. చేతిలో మూడు వికెట్లు. ఇక ఆసీస్ ఓటమి పక్కా అనుకున్నారంతా. 91/7 వికెట్ల నుంచి 292 పరుగులకు చేరుకుంది. ఆ క్షణంలో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన మ్యాక్స్ వెల్.. 10 సిక్సర్లు, 21 ఫోర్లతో.. 128 బంతుల్లోనే 201 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఓ వైపు తొడ కండరాలు పట్టేసినా.. రన్స్ తీయడానికి వీలు లేకున్నా.. ఒంటి కాలిపై నిల్చొని బ్యాటింగ్ చేశాడు. ఈ డబుల్ సెంచరీతో వన్డేల్లో 6 వికెట్ తర్వాత బ్యాటింగ్ చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కపిల్ దేవ్ రికార్డ్ బ్రేక్ చేసాడు. అంతేకాదు ఆస్ట్రేలియా తరపున డబుల్ సెంచరీ చేసిన మొదటి ప్లేయర్ గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. మ్యాక్స్ వెల్ ఆడిన ఈ ఇన్నింగ్స్ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. సచిన్, సెహ్వాగ్ లాంటి దిగ్గజాలు మ్యాక్సీ ఇన్నింగ్స్ ను కొనియాడుతూ ట్వీట్ చేశారు.