Mohammed Shami : వచ్చిన అవకాశంతో అదరగొట్టాడు.. కివీస్‌ వెన్నువిరిచాడు

Update: 2023-10-23 04:00 GMT

నిన్న న్యూజిలాండ్‌‌తో జరిగిన టీమిండియా మ్యాచ్ చూసిన వారందరికీ ఒకటే డౌట్. షమిని ఇన్నాళ్లు టీమ్ లోకి ఎందుకు తీసుకోలేదని! శార్దూల్‌ ఠాకూర్‌ ఏ రకంగా షమి కంటే మెరుగైన బౌలర్‌ అన్నది ప్రతీ ఒక్క అభిమాని మదిలో అనుమానం. కెరీర్‌ గణాంకాలు చూసినా.. ఇటీవలి ఫామ్‌ చూసినా.. షమికి దరిదాపుల్లో నిలిచే బౌలర్‌ కాడు శార్దూల్‌. వేగంలో, కచ్చితత్వంలో, నియంత్రణలో.. ఇలా ఎందులోనూ షమికి, శార్దూల్‌కు పోలిక లేదు. అలాంటి వ్యక్తి ని జట్టు యాజమాన్యం ఎందుకు ఎంచుకోలేదన్నది అందరి ప్రశ్న. మొత్తానికైతే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని.. తానేంటో మరోసారి నిరూపించాడు.

వరల్డ్‌ కప్‌లో పలు మ్యాచ్‌లకు ‘బెంచ్‌’కే పరిమితమైనా బాధపడలేదు. దొరికిన అవకాశాన్ని వినియోగించుకొని కివీస్‌ వెన్నువిరిచాడు. ఆ జట్టు భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. తద్వారా తానెంత విలువైన బౌలరో చూపించాడు. ఈక్రమంలో వరల్డ్‌ కప్‌లలో 2 సార్లు 5 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసుకున్న షమీ.. తాజాగా న్యూజిలాండ్‌పై సేమ్‌ సీన్‌ రిపీట్‌ చేశాడు. ఈ ప్రపంచకప్‌లో తానాడిన తొలి మ్యాచ్‌(న్యూజిలాండ్ Vs భారత్) లో 10 ఓవర్లు వేసి 54 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. 5 వికెట్లు తీశాడు.

తొమ్మిదో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన షమీ.. మొదటి బంతికే ఓపెనర్ యంగ్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఈ వికెట్ ద్వారా వన్డే ప్రపంచకప్ హిస్టరీలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లలో మూడో స్థానానికి చేరుకున్నాడు షమీ. శాంట్నర్‌ను బౌల్డ్‌ చేసిన యార్కర్‌ బంతి ఈ మ్యాచ్‌కే హైలైట్‌. మిగతా వికెట్లలోనూ షమీ తన నైపుణ్యాన్ని చూపించాడు. సులువుగా 300 దాటేలా కనిపించిన కివీస్‌.. 273కు పరిమితమైందంటే అది కచ్చితంగా షమీ ఘనతే. పేస్‌కు అనుకూలిస్తున్న ధర్మశాల పిచ్‌ను అతను మ్యాచ్‌లో మిగతా బౌలర్లందరికంటే బాగా ఉపయోగించుకున్నాడు. సెంచరీ వీరుడు మిచెల్‌ సైతం షమిని ఆడటంలో కష్టపడ్డాడు. ఇదే మ్యాచ్‌లో షమీ బదులు శార్దూల్‌ ఆడి ఉంటే.. ఇంత బాగా బౌలింగ్‌ చేసేవాడా అన్నది ప్రశ్న. ఈ ప్రపంచకప్‌లో టీమిండియా ఇప్పటి వరకూ 4 మ్యాచ్‌లు ఆడగా.. నాలుగింటిలోనూ షమీకి అవకాశం దక్కలేదు. అయితే 5 మ్యాచ్ కు మాత్రం హార్దిక్‌ గాయపడ్డాడన్న కారణంతో షమీని తీసుకున్నారు. మొత్తానికి వచ్చిన అవకాశంతో అదరగొట్టాడు షమీ. తనను పక్కన పెట్టడం ఎంత తప్పో రుజువు చేశాడు.


Tags:    

Similar News