World cup 2023: 24 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్.. ఇన్స్టాలో ఎమోషనల్ పోస్ట్
ఆఫ్ఘనిస్తాన్ యంగ్ స్టార్ బౌలర్ నవీన్ ఉల్ హక్ వన్డే ఫార్మట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వరల్డ్ కప్ లో సౌతాఫ్రికాతో జరిగిన చివరి మ్యాచ్ లో ఓటమి అనంతరం తన రిటైర్మెంట్ ను ప్రకటించాడు. ‘దేశానికి ప్రాతినిధ్యం వహించడం చాలా గర్వంగా ఉంది. ఈ వన్డే వరల్డ్ కప్ లో ఆడి ఓడిఐ ఫార్మట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. ఇకపై టీ20ల్లో మాత్రమే కొనసాగుతా. టీ20 ఫార్మట్ లో సుదీర్ఘమైన కెరీర్ ను కొనసాగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. ఇన్నిరోజులు నాకు మద్దతుగా నలిచిన ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డ్ కు, అభిమానులకు ధన్యవాదాలు’ అని ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు 2016లో అరంగేట్రం చేసిన నవీన్.. ఇప్పటివరకు 15 వన్డేలు మాత్రమే ఆడాడు. అందులో 22 వికెట్లు పడగొట్టాడు. పొట్టి ఫార్మట్ లో అద్భుతంగా రాణిస్తున్న నవీన్.. 27 మ్యాచుల్లో 34 వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్ తోపాటు.. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్స్ లో ఆడుతుంటాడు. ఐపీఎల్ 16 సీజన్ లో లక్నోకు ఆడిన నవీన్.. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీతో జరిగిన గొడవలో వార్తల్లోకి ఎక్కాడు.