ICC ODI World Cup 2023: మ్యాచ్ జరుగుతున్నా.. ఉప్పల్ స్టేడియం బోసిపోయింది
సొంత గడ్డపై ప్రపంచకప్ అంటే ఏ రేంజ్ లో హైప్ ఉంటుంది. స్టేడియం బయట గుమి గూడిన అభిమానులు, స్టేడియం లోపల అరుపులు.. కేకలు, ఇలా ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇక హైదరాబాద్ లో మ్యాచ్ అంటే ఓ రేంజ్ లో ఊహించుకుంటాం. అయితే ఈసారి అవేం కనిపించడం లేదు. స్టేడియాలన్నీ ఫ్యాన్స్ లేక బోసిపోతున్నాయి. అసలు గ్రౌండ్ లో జరుగుతుంది వరల్డ్ కప్ మ్యాచేనా అనే అనుమానం కలుగుతుంది. ఇవాళ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో కూడా అదే జరిగింది. పాకిస్తాన్, నెదర్లాండ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ప్రేక్షకుల్లేక స్టేడియం బోసిపోయింది. మధ్యాహ్నం రెండు గంటలకు మ్యాచ్ ప్రారంభం అయింది.
దాదాపు 50 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యం ఉన్న ఉప్పల్ స్టేడియంలో 4 వేల మంది కూడా కనిపించడం లేదు. ఆడుతుంది ఏ జట్టైనా సరే మన హైదరాబాద్ అభిమానులు స్టేడియానికి ఎగబడతారు. టికెట్ల కోసం కొట్టుకుంటారు. అలాంటిది వరల్డ్ కప్ మ్యాచ్ కు ఇంత తక్కువమంది అభిమానులు రావడం చూస్తుంటే.. హైదరాబాద్ అభిమానులకు ఇంటరెస్ట్ లేదని అర్థం అవుతుంది. అయితే ఎండ తీవ్రత, ఆఫీసులు ఉండటం వల్లే ప్రేక్షకులు స్టేడియానికి రాలేదనే వాదన వినిపిస్తుంది. అయితే నిన్న అహ్మదాబాద్ వేదికపై ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఓపెనింగ్ మ్యాచ్ లో కూడా ఇదే పరిస్థితి ఎదురయింది. లక్షా 50 వేల మంది సామర్థం ఉన్న అహ్మదాబాద్ స్టేడియంలో 40 వేల మంది కూడా రాలేదు.