IND vs PAK : భారత్ vs పాకిస్తాన్.. తొలి మ్యాచ్ ఎప్పుడు జరిగిందో తెలుసా?

By :  Bharath
Update: 2023-10-14 08:44 GMT

క్రికెట్ ప్రపంచకప్ అనగానే అందరికీ గుర్తొచ్చేది దయాదుల పోరు. భారత్, పాకిస్తాన్ జట్లు పోరాడుతుంటే మ్యాచ్ చూసే ప్రేక్షకుల్లో.. ఆందోళన, ఆవేశం, ఉత్సాహం, టెన్షన్ ఇలా అన్నీ కలగలిపిన ఎమోషన్స్ ఉంటాయి. అంతటి హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం ప్రపంచం ఎదురుచూస్తుందంటే అస్సలు తప్పులేదు. కాగా ఇవాళ (అక్టోబర్ 14) అహ్మదాబాద్ వేదికపై ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. దాదాపు 1,32,000 మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా మ్యాచ్ ను చూడనున్నారు. ఈ మ్యాచ్ లో భారత్ గెలుపు అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వన్డే వరల్డ్ కప్ చరిత్రలో భారత్ ఒక్కసారి కూడా పాకిస్తాన్ చేతిలో ఓడిపోలేదు. ఇరు జట్లు ఇప్పటి వరకు 7 సార్లు ముఖాముఖి తలపడగా.. 7 సార్లు టీమిండియా గెలిచింది. ఇప్పుడు ఎనిమిదోసారి కూడా పాక్ ను చిత్తు చేయాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు.

తొలి మ్యాచ్ ఎప్పుడంటే:

1992లో ఆస్ట్రేలియాలో జరిగిన బెన్సన్ అండ్ హెడ్జెస్ వరల్డ్ కప్ లో తొలిసారి భారత్, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. సిడ్నీలో జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా, పాకిస్తాన్ ను 43 పరుగుల తేడాతో చిత్తు చేసింది. టీమిండియాకు మహ్మద్ అజారుద్దీన్ నాయకత్వం వహించగా.. పాక్ కు ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్ గా ఉన్నారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ 216 పరుగులు చేసింది. సచిన్ టెండూల్కర్ 54 పరుగులు, అజయ్ జడేజా 46 పరుగులతో అజేయంగా నిలిచారు. 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్.. 173 పరుగులకే కుప్పకూలింది. కపిల్ దేవ్, మనోజ్ ప్రభాకర్, జవగల్ శ్రీనాథ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

Tags:    

Similar News