టీమిండియా కోచ్ ఎవరన్నదానిపై ఉత్కంఠ వీడింది. రాహుల్ ద్రవిడే కోచ్గా కొనసాగనున్నాడు. ప్రధాన కోచ్‌గా కొనసాగేందుకు ద్రవిడ్ అంగీకరించాడు. రాహుల్‌తోపాటు మిగితావారి పదవీకాలాన్ని కూడా బీసీసీఐ పొడిగించింది. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ దిలీప్‌ల పదవీకాలాన్ని బీసీసీఐ పొడగించింది. దీంతో వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్తో పాటు 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి ద్రవిడే కోచ్గా ఉండనున్నారు. అయితే వీరు ఎప్పటివరకు ఈ పదవిలో కొనసాగుతారన్నది బీసీసీఐ వెల్లడించలేదు.
కాగా మొదట కోచ్గా కొనసాగేందుకు రాహుల్ ఒప్పుకోలేదని వార్తలు వచ్చాయి. బీసీసీఐ కోచ్గా ఉండాలని కోరినా ద్రవిడ్ ససేమీరా అన్నారని ప్రచారం జరిగింది. దీంతో అతడి స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ను కోచ్గా ఎంపిక చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. ఈ క్రమంలో రంగంలోకి దిగిన బీసీసీ పెద్దలు ద్రవిడ్తో చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలం అవ్వగా.. ద్రవిడ్ కోచ్గా కొనసాగేందుకు అంగీకరించారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా రాహుల్ ద్రవిడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ద్రవిడ్ కోచ్గా ఉండేందుకు ఒప్పుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు.