రంజీల్లో ధోనీ మాజీ జట్టు సరికొత్త చరిత్ర

Byline :  Bharath
Update: 2024-02-19 14:39 GMT

రైల్వేస్ జట్టు రంజీ క్రికెట్‌ చరిత్రలో సంచలనం సృష్టించింది. 1934 నుంచి ప్రారంభమైన ఈ టోర్నీ చరిత్రలో రైల్వేస్‌ జట్టు తొలిసారి అత్యధిక పరుగుల ఛేదనతో విజయం సాధించింది. రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో భాగంగా ఎలైట్‌ గ్రూప్‌ సి లో ఉన్న రైల్వేస్‌.. ఫైనల్‌ లీగ్‌ మ్యాచ్‌లో త్రిపుర జట్టుతో తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన త్రిపుర 378 పరుగుల లక్ష్యాన్ని విధించింది. దాన్ని రైల్వేస్ జట్టు విజయవంతంగా ఛేదించింది. తొలి ఇన్నింగ్స్‌లో వంద పరుగులు చేయడానికి నానా తంటాలు పడ్డ రైల్వేస్‌.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. తద్వారా గతంలో సౌరాష్ట్ర పేరిట ఉన్న 372 పరుగుల ఛేదన రికార్డును.. రైల్వేస్ బ్రేక్‌ చేసింది. కాగా ఈ జట్టు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాజీ జట్టు కావడం గమనార్హం.

ఫిబ్రవరి 16న మొదలైన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన త్రిపుర.. 149 పరుగులకే ఆలౌట్ అయింది. తర్వాత బ్యాటింగ్ చేసిన రైల్వేస్ 105 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్ లో త్రిపుర 333 పరుగులు చేయగా.. చేదనలో రైల్వేస్ 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అనంతరం వచ్చిన మహమ్మద్ సైఫ్ (106), ఓపెనర్ ప్రథమ్ సింగ్ (169)కు సహకారం అందించి శతకాలతో చెలరేగడంతో.. రైల్వేస్ ఘన విజయం సాధించింది.

Tags:    

Similar News