ఇప్పటి వరకు ఏ ఆటంకం లేకుండా జరిగిన మ్యాచ్ కు వరుణుడు అడ్డుపడ్డాడు. దీంతో మ్యాచ్ అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం 9 వికెట్లు కోల్పోయిన టీమిండియా 47 ఓవర్లలో 197 పరుగులు చేసింది. సూపర్ 4ను అద్భుతంగా మొదలుపెట్టిన టీమిండియాకు శ్రీలంక షాక్ ఇచ్చింది. స్పిన్ ఉచ్చుతో భారత బ్యాటర్లను ఓల్తా కొట్టించింది. ఆసియా కప్ లో అరంగేట్రం చేసిన దునిత్ వెల్లంగలే రాణించాడు. తన స్పిన్ తో భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. బౌలింగ్ తో మాయ చేసి 5 వికెట్లు పడగొట్టాడు. మిస్టరీ స్పిన్ బంతులేస్తూ రోహిత్ శర్మ (53), విరాట్ కోహ్లీ (3), శుభ్ మన్ గిల్ (19), కేఎల్ రాహుల్ (39), హార్దిక్ పాండ్యా (5)లను పెవిలియన్ చేర్చాడు. 10 ఓవర్లు వేసిన దునిత్.. 4 సగటుతో 40 పరుగులే ఇచ్చుకున్నాడు. అందులో ఒక మెయిడెన్ ఓవర్ ఉంది.
మిగతా లంక బౌలర్లు కూడా రాణించారు. కట్టుదిట్టంగా బంతులేస్తూ భారత బ్యాటర్లను కట్టడి చేశారు. మరో లంక బౌలర్ చరిత్ అసలంక 4 వికెట్లు పడగొట్టాడు. అలంక బౌలింగ్ లో ఇషాన్ కిషన్ (33), జడేజా (4), బుమ్రా (5), కుల్దీప్ (0) పెవిలియన్ చేరారు. ప్రస్తుతం భారత్ చేతిలో ఒక వికెట్ మాత్రమే ఉంది. వర్షం ఆగితే మిగతా మూడు ఓవర్లు వేయించి మొదటి ఇన్నింగ్స్ ను పూర్తి చేస్తారు. ప్రస్తుతం క్రీజులో ఉన్న అక్షర్.. మూడు ఓవర్లు బ్యాటింగ్ చేసి స్కోరును 200 దాటించాల్సిన అవసరం ఉంది. భారత్ ఈ మ్యాచ్ ను తప్పక గెలవాల్సి ఉంటుంది. లేదంటే ఫైనల్ చేరే అవకాశం కోసం ఎదురుచూడాలి. బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ తప్పక గెలవాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులు బట్టి చూస్తుంటే లంకను తక్కువ అంచనా వేయలేం. వాళ్ల బ్యాటింగ్ ఆర్డర్ కూడా బాగానే ఉంది.