India Vs Australia : భారత్ - ఆసీస్ రెండో వన్డేకు వర్షం ముప్పు
ఇవాళ భారత్ - ఆసీస్ మధ్య రెండో వన్డే జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో గెలిచి భారత్ మంచి ఊపు మీద ఉండగా.. రెండో మ్యాచ్లో గెలిచి సిరీస్ సమం చేయాలని ఆసీస్ చూస్తోంది. ఈ క్రమంలో తాడో పేడో తేల్చుకునేందుకు రెండు టీంలు సిద్ధమయ్యాయి. అయితే ఈ మ్యాచ్ జరుగుతుందా అనే అనుమానాలు షురూ అయ్యాయి. దానికి కారణం వర్షం.
ఈ మ్యాచ్ మధ్యప్రదేశ్లోని ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది. అయితే ఈ ప్రాంతంలో ఇవాళ వర్షం పడే అవకాశం అధికంగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పింది. ఇక మ్యాచ్ జరిగే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడొచ్చని అంచనా వేసింది. మొదటి వన్డే జరుగుతున్న సమయంలోనూ వర్షం పడింది. దాంతో కొద్దిసేపు ఆటను నిలిపేశారు. ఇవాళ కూడా వర్షం ముప్పు ఉండడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
తొలి వన్డేలో టీమిండియా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. 277 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాహుల్ సేన.. 48.4 ఓవర్లలోనే టార్గెట్ను ఛేదించింది. ఇవాళ్టి మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. అయితే సిరీస్ సమం చేయాలని కంగారూలు ప్లాన్ వేస్తున్నారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇప్పటివరకు 147 వన్డే మ్యాచ్‌లు జరిగ్గా.. ఆస్ట్రేలియా 82 మ్యాచ్‌ల్లో భారత్‌ను ఓడించింది. ఇక భారత గడ్డపై ఇరుజట్ల మధ్య 68 మ్యాచ్‌లు జరగ్గా.. టీమిండియా ఆస్ట్రేలియాను 31 సార్లు ఓడించింది.