ind vs Eng : రెండో టెస్టుకు కీలక ఆటగాళ్ల దూరం.. వారి స్థానంలో ఎవరంటే..?

Byline :  Krishna
Update: 2024-01-30 02:55 GMT

ఇంగ్లాండ్తో జరగబోయే రెండో టెస్టుకు ముందు భారత్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కీలక ఆటగాళ్లు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ జట్టుకు దూరమయ్యారు. తొలి టెస్టు సమయంలో వీరు గాయపడ్డారు. రెండో ఇన్నింగ్స్‌లో రన్ చేస్తుండగా జడేజా తొడ కండరాలు పట్టేయడంతో అతను రనౌట్‌ అయ్యాడు. కేఎల్ రాహుల్ తొడ నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో వీరు రెండో టెస్టు ఆడడం లేదు. ప్రస్తుతం వీరిని బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షిస్తోంది.

రాహుల్, జడేజా స్థానంలో మరో ముగ్గురు ఆటగాళ్లను బీసీసీఐ ఎంపిక చేసింది. సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్ లను బీసీసీఐ సెలక్ట్ చేసింది. టీమిండియాలో చోటు కోసం సర్ఫరాజ్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తుండగా.. దీంతో ఆ నిరీక్షణకు తెరపడింది. గత కొంత కాలంగా రంజీ ట్రోఫీల్లో సర్ఫరాజ్ పరుగుల వరద పారిస్తున్ానడు. ఇప్పటివరకు 45 మ్యాచులు ఆడిన అతడు 3912 రన్స్ చేశారు. అందులో 14 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉండడం విశేషం.

కాగా ఫిబ్రవరి 2 నుంచి విశాఖ వేదికగా రెండో టెస్ట్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ కోసం టీమిండియా విశాఖకు వెళ్లింది. హైదరాబాద్‌ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లాండ్‌ 23 పరుగుల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని ప్రదర్శించినప్పటికీ ఓటమిపాలైంది. జడేజా తొలి ఇన్నింగ్స్‌లో 87 పరుగులు చేసి సత్తా చాటాడు. అంతేగాక అటు బౌలింగ్‌లోనూ జడ్డూ రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 3, రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్‌ స్పిన్‌కు పేక మేడలా కూలిపోయిన రోహిత్‌ సేన.. ఉప్పల్‌లో టెస్టుల్లో అజేయ రికార్డును చేజేతులా కోల్పోయింది.


Tags:    

Similar News