ఎంట్రీ మామూలుగా లేదుగా.. ఒక్క ఇన్నింగ్స్తో అప్పటి రికార్డులన్నీ బ్రేక్
టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, అరంగేట్ర ఆటగాడు యశస్వీ జైశ్వాల్ రికార్డ్ సృష్టించారు. వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో.. 17 ఏళ్ల రికార్డ్ ను బద్దలు కొట్టారు. వీళ్ల ఓపెనింగ్ భాగస్వామ్యం మొదటి ఇన్నింగ్స్ లో 229 పరుగులు చేసింది. టెస్ట్ క్రికెట్ లో వెస్టిండీస్ గడ్డపై 100 పరుగుల భాగస్వామ్యం చేసిన తొలి ఓపెనింగ్ జోడీగా రోహిత్, జైశ్వాల్ చరిత్ర సృష్టించారు. దాదాపు 13 టెస్ట్ మ్యాచ్ ల తర్వాత కరీబియన్ గడ్డపై భారత ఓపెనర్లు 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం గమనార్హం.
44 ఏళ్ల రికార్డ్ సైతం.. :
టీమిండియాకు ఆసియా అవతల తొలి వికెట్ కు ఇదే అత్యధిక భాగస్వామ్యం. ఈ ఇన్నింగ్స్ తో 44 ఏళ్ల రికార్డ్ ను చెరిపేశారు. 1979లో చేతన్ చౌహాన్- గవాస్కర్ ఇంగ్లండ్ పై 213 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ రికార్డ్ ను రోహిత్, జైశ్వాల్ జోడీ తుడిచి పెట్టేసింది. ప్రస్తుతం భారత్ ఆధిక్యం దిశగా దూసుకు పోతోంది. జైశ్వాల్ 200 పరుగులు చేసేలా కనిపిస్తున్నాడు.
ఓపెనర్ గా 4వ ఆటగాడు:
అరంగేట్ర మ్యాచ్ లోనే సెంచరీ చేసిన 17వ టీమిండియా బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. పదేళ్ల తర్వాత తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన రెండో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా నిలిచాడు. శిఖర్ ధవన్ (187) 2013 మార్చిలో.. ఆసీస్‌పై సెంచరీ చేశాడు. ప్రస్తుతం జైస్వాల్ శతకం బాదడం విశేషం. ఇక ఓపెనర్‌గా మొదటి టెస్టులోనే సెంచరీ చేసిన మూడో టీమిండియా ఆటగాడిగా జైశ్వాల్ నిలిచాడు. అంతకుముందు శిఖర్ ధావన్, పృథ్వీ షా ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా విండీస్‌పైనే అరంగేట్రం చేసి.. తొలి మ్యాచ్ లో సెంచరీ సాధించాడు. అంతేకాకుండా టెస్టుల్లో అతి చిన్న వయసులో (21 ఏళ్ల 186 రోజులు) సెంచరీ చేసిన నాలుగో బ్యాటర్ జైశ్వాల్. ఈ జాబితాలో జైశ్వాల్ ముందు పృథ్వీ షా (18 ఏళ్ల 329 రోజులు), అబ్బాస్ (20 ఏళ్ల 126 రోజులు), గుండప్ప విశ్వనాథ్ (20 ఏళ్ల 276 రోజులు) ఉన్నారు.