టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మరికొన్ని గంటల్లో మహాసంగ్రామం జరగనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు టీంలు చెమటోడ్చుతున్నాయి. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వరల్డ్ కప్ టోర్నీ కోసం రెండేళ్ల నుంచే సన్నాహాలు ప్రారంభించామని తెలిపారు. తాను కెప్టెన్ అయినప్పటి నుంచి ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు ఆడినట్లుగానే ఫైనల్మ్యాచ్ లోనూ మా జోరు చూపిస్తామని అన్నారు.
టీమిండియా గెలుపులో రాహుల్ ద్రవిడ్ పాత్ర ఎంతో ఉందని రోహిత్ చెప్పాడు. ప్లేయర్స్ తమ బాధ్యత నెరవేర్చేలా సన్నద్ధతం చేయడంలో ద్రవిడ్ కృషి అమోఘం అన్నారు. 2022 టీ20 వరల్డ్ కప్లో టీమిండియా వైఫల్యం తర్వాత కూడా ఆటగాళ్లకు ద్రవిడ్ మద్ధతుగా నిలిచారన్నారు. టీంలో ఏ ప్లేయర్ ఏ పాత్ర పోషించాలన్న దానిపై స్పష్టత ఉందని, అప్పగించిన బాధ్యతలు నెరవేర్చగల సరైన ఆటగాళ్లను గుర్తించి వారిని జట్టులోకి తీసుకున్నామని వివరించాడు.
ఈ టోర్నీ మొదట్లో షమీని జట్టులోకి తీసుకోకపోవడం కఠినమైన అంశమని రోహిత్ అన్నారు. అయితే ఆ సమయంలో షమీ ఇతర పేసర్లకు సపోర్ట్గా నిలిచారన్నారు. నెట్స్లో షమీ తన బౌలింగ్ కు మరింత గా సానబెట్టుకున్నాడని కితాబునిచ్చాడు. ప్రస్తుతం ఆసీస్ టీం పటిష్ఠంగా ఉందన్న రోహిత్.. వారి ఫామ్ ను చూసి తాము ఎటువంటి ఆందోళన చెందడం లేదన్నారు. తమ ప్రణాళికలు తమకు ఉన్నాయని.. ఫైనల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు.