India vs Australia: ‘వరల్డ్కప్లో అశ్విన్ ఉంటాడా..?’ రోహిత్ ఏమన్నాడంటే?
భారత మేటి స్పిన్నర్లలో ఒకడు. ఒంటి చేత్తే.. ఎన్నో కీలక విజయాలు అందించాడు. తన స్పిన్ వేరియేషన్స్ తో ప్రత్యర్థిని వణికించగలడు. భాగస్వామ్యాలను కూల్చి మ్యాచ్ ను మలుపు తిప్పగలదు. అంతా బాగానే ఉన్నా.. టెస్టులకు మినహా ఏ ఫార్మట్ కు బీసీసీఐ సెలక్ట్ చేయటం లేదు. వన్డేలు ఆడక దాదాపు ఏడాది గడుస్తుంది. ప్రస్తుత ఫామ్, స్వదేశంలో టోర్నీ.. ఇలా అన్ని కలిసిరావడంతో అశ్విన్ ను వరల్డ్ కప్ టీంలో కచ్చితంగా సెలక్ట్ చేస్తారనుకున్నారు. కానీ అంచనాలను తారుమారు చేస్తూ అక్షర్ పటేల్ కు ఛాన్స్ ఇచ్చారు. దీనిపై క్రికెట్ ఎక్స్ పర్ట్స్ తో పాటు అభిమానులు బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంతలో అక్షర్ కు గాయం కావడంతో ఆస్ట్రేలియా వన్డే సిరీస్ లో అశ్విన్ కు చాన్స్ దక్కింది. ఇప్పటి వరకు ఆడిన ప్రతీ మ్యాచ్ లో రాణించాడు. ఈ క్రమంలో అక్షర్ పటేల్ ప్లేస్ లో అశ్విన్ ను తీసుకుంటారా అని కెప్టెన్ రోహిత్ శర్మను అడిగితే ఈ సమాధానం ఇచ్చాడు.
‘అశ్విన్ క్లాస్ బౌలర్. ఒత్తిడిని అధిగమించి మ్యాచ్ ను ఎలా గెలవాలో తెలుసు. ఎన్నోఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నాడు. గొప్ప అనుభవం ఉంది. ఈ వన్డే సిరీస్ మినహా ఏడాది నుంచి ఏ వన్డే మ్యాచ్ ఆడలేదు. అలాగని అతని అనుభవం, సీనియారిటీని పక్కనబెట్టలేం. అవకాశం ఉంటే.. వరల్డ్ కప్ కు అతన్ని తప్పకుండా పరిగణంలోకి తీసుకుంటాం. కానీ కచ్చితం అని చెప్పలేం. బ్యాకప్ గా చాలామంది ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. వాళ్ల తగినన్ని మ్యాచ్ లు కూడా ఆడారు’ అని చెప్పుకొచ్చాడు.