Rohit Sharma : బ్యాటర్గా, కెప్టెన్గా ఫెయిల్ అవుతున్న రోహిత్ శర్మ.. టెస్టుల్లో వెనకబడుతున్న భారత్
(Rohit Sharma) టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ టెస్ట్ సిరీస్ సవాలుగా మారింది. ఇటు ప్లేయర్ గా, కెప్టెన్ గా విఫలమవడంతో సీనియర్లు రోహిత్ పై విమర్శలు చేస్తున్నారు. టెస్టుల్లో ఊహించని పరాభవాలు, సొంత గడ్డపై తేలిపోవడం వంటి అంశాలపై క్రికెట్ ఎక్స్ పర్ట్స్ రోహిత్ పై మండిపడుతున్నారు. రోహిత్ కన్నా.. కోహ్లీనే మేలంటూ కామెంట్ చేస్తున్నారు. కోహ్లీ హయాంలో విదేశాల్లో రికార్డ్ విజయాలు, స్వదేశంలో భారత్ జైత్రయాత్ర కొనసాగింది. టెస్ట్ చాంపియన్షిప్ 2019 ఫైనల్స్ తో పాటు.. ఐసీసీ ర్యాంకింగ్స్ లో జట్టును అగ్రస్థానంలో నిలబెట్టాడు. ఇక బ్యాటింగ్ లో అతని ప్రదర్శనేంటో తెలిసిందే. అలా.. ‘కోహ్లీ ప్రపంచలో బెస్ట్ టెస్ట్ కెప్టెన్’అని పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. రోహిత్ టెస్ట్ పగ్గాలు చేపట్టిన తర్వాత జట్టు ఓడిపోతుంది. తాజాగా సొంతగడ్డపై ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవడం, అంతకుముందు విదేశీ పర్యటనలో ఫెయిల్ అయి సిరీసు సమర్పించుకోవడం రోహిత్ కెప్టెన్సీపై విమర్శలకు అవకాశాలయ్యాయి.
91 ఏళ్ల తర్వాత తొలిసారి:
వీటితో పాటు రోహిత్ టెస్ట్ విన్ పర్సంటేజ్ పడిపోవడం, వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ 2023-2024లో ర్యాంకిగ్ పడిపోడంతో రోహిత్ పై కంప్లైట్స్ ఎక్కువయ్యాయి. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ లో 5 స్థానంలో ఉన్న భారత్ ఫైనల్స్ కు చేరడం కాస్త కష్టమే. హైదరాబాద్ టెస్ట్ లో చేజేతులా మ్యాచ్ ఓడిపోయారు. మొదటి రెండు రోజుల్లో ఆధిపత్యంలో ఉన్న జట్టు.. బ్యాటింగ్, బౌలింగ్ లో ఫెయిలై 28 పరుగులతో ఓటమి పాలైంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో వందకుపైగా ఆధిక్యం ఉండి కూడా భారత్ మ్యాచ్ ఓడిపోవడం 91 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
రోహిత్పై భారం:
కోహ్లీ కెప్టెన్సీకి రిటైర్మెంట్ ప్రకటించాక.. 2021 నుంచి పూర్తిస్థాయి కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు రోహిత్ శర్మ. ఇప్పటి వరకు 12 మ్యాచులకు కెప్టెన్సీ చేయగా.. అందులో 6 విజయాలు, 4 ఓటములు, 2 డ్రా ఉన్నాయి. విదేశాల్లో టెస్టుల్లో 5 మ్యాచుల్లో 2 గెలవగా 2 ఓడిపోయారు. 1 మ్యాచ్ డ్రా అయింది. ఇక బ్యాటింగ్ లో కూడా రోహిత్ పెద్దగా రాణించట్లేదు. గడిచిన 8 మ్యాచుల్లో చూసుకుంటే.. 80,57,5,0,39,16,24,39 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో బ్యాటర్ గా కూడా జట్టుకు భారం అవుతున్నాడని క్రికెట్ ఎక్స్ పర్ట్స్ ఆరోపిస్తున్నారు. అయితే రోహిత్ సపోర్టర్స్ మాత్రం మద్దతిస్తున్నారు. కెప్టెన్సీ భారం, జట్టులో ఆటగాళ్లు ఫెయిల్ అయి సిరీసుల్లో ఓడిపోవడం లాంటి కారణాల వల్ల రోహిత్ శర్మ బ్యాటింగ్ లో మెరుగైన ప్రదర్శన చేయట్లేదని చెప్పుకొస్తున్నారు.