రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా తప్పిస్తూ.. ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై అభిమానులు, పలువురు మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముంబైకి ఐదు ఐపీఎల్ కప్పులు అందించిన కెప్టెన్ ను సమయం, సందర్భం, రీజన్ లేకుండా తప్పించడంపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ విషయాన్ని రోహిత్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ బద్రినాథ్ విభిన్నంగా స్పందించాడు. ముంబై తప్పిస్తే ఏంటి రోహిత్ శర్మను చెన్నై కొనుగోలు చేస్తుంది. కెప్టెన్ గా నియమిస్తుందని, ఏకంగా సీఎస్కే జెర్సీకి రోహిత్ ముఖానన్ని జోడింది సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ‘ఫ్యూచర్ గురించి నిరంతరం ఆలోచించే ఫ్రాంచేజీ ముంబై. దానికోసం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనకాడదు. అందుకే ఐపీఎల్ లో సక్సెస్ ఫుల్ జట్టుగా కొనసాగుతుంది. రోహిత్ ను ముంబై వదులుకుంటే.. సీఎస్కే కొనుగోలు చేస్తుంది. కెప్టెన్ గా నియమిస్తుంది. ధోనీ రిటైర్ అయి మెంటార్ గా కొనసాగుతాడు’ అంటూ బద్రినాథ్ పోస్ట్ పెట్టాడు.
ఈ క్రమంలో మరో వార్త రోహిత్ శర్మ, ముంబై ఫ్యాన్స్ ను ఆందోళనకు గురిచేస్తుంది. బద్రినాథ్ అన్న మాటలకు బలం చేకూర్చుతుంది. ముంబైతో రోహిత్ శర్మ బంధం రాబోయే సీజన్ తో ముగియనుందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. 2025లో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. అప్పుడు ఒక్కో జట్టు ముగ్గురు స్వదేశీ, ఓ విదేశీ ఆటగాన్ని మాత్రమే అంటిపెట్టుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే ముంబై ఫ్రాంచైజి హార్దిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ లను తప్పకుండా అంటిపెట్టుకుంటుంది. అదే జరిగితే ముంబై రోహిత్ ను తప్పక వదలుకోవాల్సి వస్తుంది. రోహిత్ లాంటి ప్లేయర్ వేలంలోకి వస్తే.. ఫ్రాంచేజీల మధ్య గట్టి పోటీ ఉంటుంది. భారీగా ఖర్చు చేసి అతన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ రోహిత్ ముంబైకి తప్ప వేరే ఫ్రాంచైజీకి ఆడనని అనుకుంటే.. రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం లేకపోలేదు. ఇవన్నీ చూస్తుంటే.. బద్రినాథ్ చెప్పింది నిజమయ్యే అవకాశం ఉంది.