ఆ బాధ చెప్పలేనిది.. శ్రేయాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సుమారు ఆరు నెలల విరామం తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్. గత కొంతకాలంగా వెన్ను గాయంతో బాధపడ్డ అతడు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ టెస్టులో అర్థాంతరంగా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఏప్రిల్‌లో శస్త్ర చికిత్స చేయించుకున్న అయ్యర్.. ఆరు నెలల తర్వాత తిరిగి టీమిండియాతో చేరాడు. ఈనెల 30 నుంచి జరుగబోయే ఆసియా కప్‌కు ఎంపికైన నేపథ్యంలో తాజాగా అతడు తన గాయం, రీఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గాయం కారణంగా చాలా ఇబ్బందులు పడ్డానని చెప్పుకొచ్చాడు.
ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘వెన్నులో డిస్క్ జారడంతో దాని ప్రభావం నరాలపై పడింది. ఆ నొప్పి నా శరీరంలోని ప్రతి పార్ట్‌కు తాకింది. నా కాలి బొటనవేలు కూడా నొప్పి ఉండేది. అది చాలా భయంకరంగా అనిపించింది. అప్పుడు భరించలేనంత నొప్పి ఉండేది. ఆ సమయంలో నాకు ఏం జరుగుందో కూడా చెప్పలేకపోయేవాణ్ణి. నాకు చాలాకాలం నుంచి ఈ సమస్య ఉంది. అయితే చాలాకాలంగా నేను ఇంజెక్షన్లు తీసుకుని తక్షణ ఉపశమనం పొందేవాడిని. అలాగే కొన్ని మ్యాచ్‌లు కూడా ఆడాను. కానీ ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాలే తప్ప శాశ్వతంగా శస్త్ర చికిత్స చేయించుకోవడమే మార్గమని గ్రహించి ఆ దిశగా ముందడుగు వేశాను.
నాకు ఇంకా సుదీర్ఘ కెరీర్ ఉంది గనక ఆపరేషన్‌కు వెళ్లడమే మంచిదనుకున్నాను. మళ్లీ గాయం తిరగబెట్టడంతో లండన్‌లో సర్జీరీ చేయించుకున్నా. అక్కడే మూడు వారాలు ఉన్నా. అక్కడ్నుంచి వచ్చి నేరుగా నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో జాయిన్ అయ్యా. నేను కోలుకునే క్రమంలో నా కెరీర్ ముగిసిపోతుందేమనన్న భయం కూడా వేసేది. కానీ అప్పుడు ఇక్కడి ఫిజియోలు, కుటుంబసభ్యులు, జట్టు సహచరులు ఇచ్చిన స్ఫూర్తితో మూడు నెలల్లో కోలుకున్నా. ఎన్‌సీఏలో ఫిజియోలు చాలా అండగా నిలిచారు...’ అని చెప్పాడు.