SA vs BAN: వృథా అయిన మహ్మదుల్లా ఒంటరి పోరాటం.. బంగ్లాపై సఫారీల విక్టరీ
వరల్డ్ కప్‌లో జోరుమీదున్న సౌతాఫ్రికా మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సఫారీలు.. బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించారు. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి బంగ్లాదేశ్ ముందు 383 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్.. 46.4 ఓవర్లలో ఆలౌటై 233 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో సౌతాఫ్రికా 149 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లా తరఫున ఆ జట్టు వెటరన్ ఆటగాడు మహ్మదుల్లా (111 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్ల)తో చెలరేగి 111రన్స్ చేశాడు.
సఫారీల బౌలింగ్ కు బంగ్లా బ్యాటర్లు బెంబేలెత్తారు. మార్కో జాన్సెన్ వేసిన ఏడో ఓవర్లో బంగ్లాదేశ్.. వరుస బాల్స్ లో తాంజిద్ హసన్ (12), నజ్ముల్ హోసెన్ శాంతో (0) పెవిలియన్ బాట పట్టారు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ షకిబ్ అల్ హసన్ (1), ముష్ఫీకర్ రహీమ్ (8) అలా వచ్చి ఇలా వెళ్లారు. 44 బాల్స్ ఎదుర్కొని 3 ఫోర్లు, ఒక సిక్సర్ తో 22 పరుగులు చేసిన లిటన్ దాస్ కూడా ఔట్ కావడంతో బంగ్లాదేశ్ 21వ ఓవర్లలో 81 పరుగులకే 6 కీలక వికెట్లు కోల్పోయింది.
బంగ్లా వెటరన్ ఆటగాడు మహ్మదుల్లా తన బ్యాటింగ్ తో ఆదుకున్నాడు. ఆరో వికెట్‌కు మెహిది హసన్ మిరాజ్ (11)తో కలిసి 23 పరుగులు జతచేసిన మహ్మదుల్లా.. ఏడో వికెట్‌కు నసుమ్ అహ్మద్ (19)తో కలిసి 39 బంతుల్లో 41 పరుగులు జోడించాడు. ఈ ఇద్దరూ ఔట్ అయినా ఎనిమిదో నెంబర్ బ్యాటర్ హసన్ మహ్మద్ (15) తో కలిసి 49 బంతుల్లో 37 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఫలితంగా బంగ్లాదేశ్ స్కోరు 150 మార్క్ దాటింది. 67 బాల్స్ లో హాఫ్ సెంచరీ పూర్తిచేసిన మహ్మదుల్లా.. రబాడా వేసిన 45వ ఓవర్లో రెండో బాల్ ను ఫైన్ లెగ్ దిశగా సింగిల్ తీసి 104 బంతుల్లో సెంచరీ పూర్తిచేశాడు. వరల్డ్ కప్‌లో మహ్మదుల్లాకు ఇది మూడో శతకం కావడం విశేషం. తొమ్మిదో వికెట్‌కు ముస్తాఫిజుర్ రెహ్మాన్ (11) తో కలిసి 55 బంతుల్లో 68 పరుగులు జోడించాడు. చివరకు కొయెట్జ్ వేసిన 45వ ఓవర్ నాలుగో బంతికి భారీ షాట్ ఆడబోయిన మహ్మదుల్లా.. జాన్సెన్ చేతికి చిక్కాడు.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది. సాతాఫ్రికా బ్యాటర్లలో ఓపెనర్ క్వింటన్ డికాక్ అద్భుతమైన శతకంతో చెలరేగగా.. క్లాసెన్, మిల్లర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ సూపర్ ఫామ్‌ని కొనసాగించాడు. ప్రపంచ కప్‌లో వరుసగా రెండు సెంచరీలు బాదిన అతడు.. బంగ్లాపై మ్యాచ్ లో మరో శతకం చేశాడు. డికాక్ 140 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్స్‌లతో 174 రన్స్ చేశాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ 49 బాల్స్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 90 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. డేవిడ్ మిల్లర్ 15 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లతో 34* రన్స్ చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహమూద్ 2, షోరిఫుల్, హసన్ మిరాజ్, షకీబ్ అల్ హసన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.