సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా కమిన్స్‌..మార్క్‌రమ్‌కు ఉద్వాసన!

Byline :  Vamshi
Update: 2024-03-03 05:21 GMT

ఐపీఎల్ 2024 కోసం సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ గ్రాండ్ లీగ్ కోసం అన్ని జట్లు ఇప్పటికే సన్నద్ధమయ్యాయి. అయితే ఒకసారి ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకున్న ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ మారబోతున్నాడా తెలుస్తోంది. గత ఐపీఎల్ సీజన్‌లో దారుణ ఆటతీరుతో పాయింట్ల పట్టికలో చివర నిలిచిన సన్‌రైజర్స్ టీమ్‌లో ప్రక్షాళన మొదలైంది. కెప్టెన్ మార్కరమ్‌కు ఉద్వాసన పలికి అతడి స్థానంలో ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్‌కు పగ్గాలు అప్పగించనున్నట్టు తెలిసింది. గతేడాది జరిగిన ఐపీఎల్ వేలంలో కమిన్స్‌ను యాజమాన్యం ఏకంగా రూ. 20.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అది రెండో అత్యధిక ధర. అతడికి కెప్టెన్సీ అప్పగించేందుకే అంత రేటుపెట్టి అతడిని కొనుగోలు చేసినట్టు తెలిసింది.

గత సీజన్‌లో మార్కరమ్ సారథ్యంలోని టీమ్ 14 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించింది. ఈ నేపథ్యంలో జట్టులో పలు మార్పులు చేసిన సన్‌రైజర్స్ జట్టు.. ప్రధాన కోచ్ బ్రయాన్ లారాను తప్పించి అతడి స్థానంలో ఆస్ట్రేలియా జట్టు సహాయక కోచ్‌ డేనియల్ వెటోరీని నియమించింది. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ నాయకత్వంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్‌లో అత్యుత్తమ జట్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు సారధ్య బాధ్యతలు మార్చటం ద్వారా తిరిగి పూర్వ వైభవం సాధించాలని ప్రయత్నిస్తోంది. ఐపీఎల్ లో ఈ నెల 22 నుంచి లీగ్‌కు తెరలేవనుంది. మినీ వేలంలో ఫ్రాంచైజీ కమిన్స్‌ను భారీ ధర రూ.20.50 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.గతేడాది కమిన్స్ ఆసిస్ జట్టుకు రెండు ఐసీసీ టైటిల్స్ అందించాడు. ఈ నేపథ్యంలోనే ఫ్రాంచైజీ మార్క్‌రమ్‌ను తప్పించి ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, దీనిపై ఫ్రాంచైజీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్‌ని మార్చి 23న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడనుంది.

Tags:    

Similar News