Rinku singh: ఆసీస్పై ఘన విజయం.. చరిత్ర సృష్టించిన టీమిండియా
ముందు 209 పరుగుల భారీ లక్ష్యం.. ప్రత్యర్థి జట్టులో దాదాపు సీనియర్లే.. 22/2 ఛేధనలో ఆరంభమిది. జట్టులో ఒక్క ఎక్స్పీరియన్స్డ్ బ్యాటర్ లేడు. వరల్డ్ కప్ ఫైనల్ లో ఓడిన బాధ వెంటాడుతుండగానే.. మరో ఓటమి తప్పదా.. అని నిరాశ చెందిన అభిమానులకు అద్భుత విజయాన్ని అందించారు. జోరు మీదున్న కంగారులకు కొత్తగా జట్టు పగ్గాలు అందుకున్న సూర్యకుమార్ యాదవ్ కళ్లెం వేశాడు. ఏం అనుకుని క్రీజులోకి వచ్చాడేమో కానీ.. కసితీరా బౌండరీలు బాదాడు. సిక్సర్లు, ఫోర్లు బాది స్టేడియాన్ని హోరెత్తించాడు. ఇషాన్ కిషన్, రింకూ సింగ్ కూడా సూర్యకు తోడవడంతో.. ఉత్కంఠంగా సాగిన మ్యాచ్ లో భారత్ ఒక బంతి మిగిలుండగానే విజయాన్ని అందుకుంది.
విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనర్ స్టీవెన్ స్మిత్ (52, 41 బంతుల్లో) మంచి ఆరంభానికి తోడు.. జోస్ ఇంగ్లిస్ (110, 50 బంతుల్లో) భీకర ఇన్నింగ్స్ తోడవడంతో ఆస్ట్రేలియా 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. 209 పరుగుల లక్ష్యంలో భరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ డకౌట్ (రనౌట్) అయి వెనుదిరిగాడు. యశస్వీ జైశ్వాల్ (21) కూడా దాటిగా ఆడినా ఎక్కువ సేపు క్రీజులో నిల్వలేకపోయాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ (58, 39 బంతుల్లో), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (80, 42 బంతుల్లో)కు తోడవడంతో ఛేజింగ్ ఈజీ అయింది. చివర్లో తిలక్ వర్మ (12), రింకూ సింగ్ (22, 14 బంతుల్లో) తోడవడంతో ఉత్కఠంగా సాగిన మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది.
టార్గెట్ ను ఈజీగా పూర్తిచేస్తారు అనుకున్న టైంలో సూర్య కుమార్ ఔట్ అయిపోయాడు. తర్వాత అక్షర్ పటేల్ (2), రవి బిష్నోయ్, అర్ష్ దీప్ సింగ్ డకౌట్ అవడంతో భారత్ గెలుపు అవకాశాలు సన్నగిల్లాయి. కానీ చివర్లో నిలబడ్డ రింకూ సింగ్ మ్యాచ్ ను ఫినిష్ చేశాడు. కాగా ఈ విజయంతో టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో 200 పరుగులు లేదా అంతకంటే ఎక్కువ టార్గెట్ ను అత్యధిక సార్లు (5) ఛేదించిన జట్టుగా నిలిచింది. ఈ లిస్ట్ లో భారత్ తర్వాత సౌతాఫ్రికా (4), పాకిస్తాన్ (3), ఆస్ట్రేలియా (3) ఉన్నాయి.