ఈ ఏడాది జరిగే వరల్డ్ ఛాంపియన్ షిప్, ఏషియన్ గేమ్స్ పిస్టల్ షూటింగ్ లో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి ఇషా సింగ్ ఎంపికయింది. ఇటీవల జరిగిన జాతీయ షూటింగ్ పోటీల్లో ఒలంపియన్లు మనూ బాకర్, రాహి సర్ణోబత్ ను వెనక్కి నెట్టిన ఇషా.. ట్రయల్స్ లో అగ్రస్థానం సాధించింది. దాంతో ఈ టోర్నీలకు ఇషా అర్హత సాధించిందని జాతీయ రైఫిల్ అసోసియేషన్ తెలిపింది. ఈ క్రమంలో వరల్డ్ ఛాంపియన్ షిప్, ఏషియన్ గేమ్స్ లో ఇషా.. మహిళల వ్యక్తిగత 10 మీటర్లు, 25 మీటర్ల పిస్టల్ విభాగంలో మిక్స్డ్ టీంలో పోటీ పడనుంది.
ఆగస్టు 14 నుంచి అజర్ బైజాన్ లో వరల్డ్ షూటింగ్ ఛాంపియన్ షిప్, సెప్టెంబర్ 3 నుంచి చైనాలో ఆసియా క్రీడలు జరగనున్నాయి. ఈ టోర్నీల్లో పాల్గొనే షూటర్ల జాబితాను జాతీయ రైఫిల్ సంఘం ఆదివారం (జులై 2) ప్రకటించింది. 22 మంది షూటర్లతో కూడిన భారత బృందాలు వరల్డ్ ఛాంపియన్‌షిప్ కు, ఏషియన్ గేమ్స్ కు వెళ్లనున్నాయి.