IND vs PAK: భారత్ -పాకిస్థాన్ మ్యాచ్.. ఒక్కో టికెట్ రూ.50 లక్షలపైనే !!!!
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసిన భారత్ పాక్ మ్యాచ్ ఈ నెల 2 న వర్షంతో అర్ధాంతరంగా రద్దయింది. దీంతో నిరాశగా ఉన్న ఫ్యాన్స్‌కు వచ్చే ఆదివారం(సెప్టెంబర్ 10) ఆ లోటు తీరిపోనుంది. షెడ్యూల్ ప్రకారం కొలంబోలో ఈ సూపర్-4 మ్యాచ్ జరగాల్సి ఉండగా, వర్షాల నేపథ్యంలో వేదికను ఆసియా క్రికెట్ కౌన్సిల్ మార్చనుందని తెలుస్తోంది. అయితే, ఇప్పుడంతా చర్చ వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) మీదే నడుస్తోంది. వచ్చే నెల(అక్టోబర్) 14వ తేదిన అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా, పాకిస్థాన్(India Vs Pakistan) మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ చూడటానికి క్రికెట్ ఫ్యాన్స్ టికెట్ల కోసం ఎగబడుతున్నారు. ఈ మ్యాచ్ కోసం బుక్‌మైషో ఆగస్టు 29, సెప్టెంబర్ 3న టికెట్ల విక్రయాలు చేపట్టగా గంట వ్యవధిలోనే ‘సోల్డ్ ఔట్’ బోర్డులు కనిపించాయి. దాంతో చాలామంది అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
దీంతో సెకండరీ మార్కెట్‌లో టికెట్లకు విపరీతమైన డిమాండ్ వచ్చింది. టికెట్ల కోసం లక్షల రూపాయలు పెట్టేందుకు వెనుకాడటం లేదు. సౌత్ ప్రీమియం వెస్ట్ బే టికెట్ సంస్థకు చెందిన వయాగోగో ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్మగా.. ఆ ప్లాట్‌ఫామ్‌లో కొన్ని టికెట్లకు 19.5 లక్షలకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఇక స్టేడియంలోని అప్పర్ టైర్‌లో ఉన్న కొన్ని టికెట్లు ఇంకా అమ్మకానికి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అప్పర్ టైర్‌లోని రెండు టికెట్లు మాత్రమే మిగిలి ఉన్నట్లుగా స్పోర్ట్స్ టికెట్ల ఎక్స్‌చేంజ్, రీసేల్ వెబ్‌సైట్ ‘వయాగోగో’లో చూపిస్తోంది. అయితే, ఒక్కో టికెట్ రూ.57 లక్షలు ఉండటం గమనార్హం.
దీంతో క్రికెట్ అభిమానులు తమ సోషల్ మీడియా అకౌంట్లలో బీసీసీఐ మీద ఘాటు విమర్శలు చేస్తున్నారు. వయాగోగో వెబ్‌సైట్‌లో కొన్ని టికెట్లు 65 వేల నుంచి 4.5 లక్షల వరకు అమ్ముడవుతున్నాయని ఓ యూజర్ పేర్కొన్నారు. పట్టపగలే దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఓ టికెట్‌ను 15 లక్షలకు అమ్ముతున్నట్లు వయోగోగో యాప్‌లో చూశానని.. ఆ వెంటనే సోల్డ్ అవుట్ అని బోర్డు పెట్టారని మరో యూజర్ పేర్కొన్నాడు.