Deep Fake Issue : డీప్ ఫేక్ వీడియోలపై కేంద్రం సీరియస్.. త్వరలోనే కొత్త చట్టం

Byline :  Bharath
Update: 2024-01-16 04:46 GMT

సైబర్ నేరగాళ్లు తయారు చేస్తున్న డీప్ ఫేక్ వీడియోలు దేశంలో దుమారం రేపుతున్నాయి. తాజాగా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ (Sachin Tendulkar) ఓ డీప్‌ఫేక్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవడంతో... దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసులను కోరారు. సచిన్‌ షేర్‌ చేసిన డీప్‌ఫేక్‌ వీడియోపై కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్ (Rajeev Chandrasekhar) స్పందిస్తూ... ఏఐ, డీప్‌ఫేక్‌ వంటి సాంకేతికత విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. నకిలీ సమాచారం నుంచి ప్రజలకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. డీప్‌ఫేక్‌ వీడియోలు దేశానికి చాలా ప్రమాదకరమని, యూజర్లకు హాని చేయడమే కాకుండా చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని మండిపడ్డారు. వీటిని కట్టడి చేసేందుకు అవసరమైతే త్వరలోనే పటిష్ఠమైన ఐటీ చట్టాలను అమల్లోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు.

అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేస్తున్న డీప్‌ఫేక్‌ వీడియోలు సెలబ్రెటీలకు సమస్యగా మారుతున్నాయి. రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార రంగ ప్రముఖుల డీప్ ఫేక్ వీడియోలను రూపొందిస్తున్నారు. మాజీ క్రికెటర్ సచిన్‌ టెండూల్కర్‌ ఓ గేమింగ్‌ యాప్‌నకు ప్రచారం చేస్తున్నట్లు ఓ డీప్‌ఫేక్‌ వీడియో వైరల్ అవుతుండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదంటూ క్లారిటీ ఇచ్చారు. దీనిపై ఆయన పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.

గతేడాది ప్రభుత్వం అన్ని ప్లాట్‌ఫారమ్‌లను IT నిబంధనలను పాటించాలని ఆదేశించింది. నిషేధించబడిన కంటెంట్ గురించి వినియోగదారులకు స్పష్టమైన, ఖచ్చితమైన నిబంధనలను తెలియజేయాలని కంపెనీలను ఆదేశించింది. డీప్‌ఫేక్‌లపై నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని, IT నియమాలు, ప్రస్తుత చట్టాల ప్రకారం వాటి ఉపయోగ నిబంధనలు, కమ్యూనిటీ మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్రం ప్లాట్‌ఫారమ్‌లను కోరింది. ఏదైనా సమ్మతి విఫలమైతే కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.




Tags:    

Similar News