T20 World Cup : రువాండాను చిత్తు చేసిన ఉగాండా.. వరల్డ్కప్కు క్వాలిఫై

Byline :  Bharath
Update: 2023-12-01 01:57 GMT

ఆఫ్రికా దేశం ఉగాండా క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో చరిత్ర సృష్టించింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. టీ20 వరల్డ్ కప్ కు అర్హత సాధించింది. వచ్చే ఏడాది అమెరికా, వెస్టిండీస్ సంయుక్త వేదికలపై జరిగే టీ20 వరల్డ్ కప్ లో మొదటిసారి ఆడనుంది. ఐసీసీ పురుషుల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆఫ్రికా రీజియ‌న్ క్వాలిఫ‌య‌ర్ – 2023 పోటీల్లో ఉగాండా జ‌ట్టు.. రువాండాను ఓడించి పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానంలో నిలిచింది. దీంతో వరల్డ్ కప్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. కాగా ఐసీసీ మెగా టోర్నీల్లో ఉగాండా పాల్గొనడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

ఆఫ్రికా రీజియ‌న్ క్వాలిఫ‌య‌ర్ లో మొత్తం ఏడు దేశాలు పాల్గొనగా.. ఇప్పటికే నమీబియా క్వాలిఫై అయింది. ఆడిన ఐదు మ్యాచుల్లో ఐదింట్లో గెలిచిన నమీబియా పది పాయింట్లతో టేబుల్ లో అగ్రస్థానంలో నిలిచింది. ఉగాండా ఆరు మ్యాచులు ఆడగా.. ఐదిట్లో గెలిచి రెండో స్థానంలో నిలిచింది. కాగా ఆఫ్రికా రీజియ‌న్ క్వాలిఫ‌య‌ర్ లో టాప్ లో నిలిచిన రెండు జట్లు టీ20 వరల్డ్ కప్ కు అర్హత సాధిస్తాయి అని ఐసీసీ తెలిపిన విషయం తెలసిందే. నిన్న జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రువాండా 18.5 ఓవర్లలో 65 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. 66 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఉగాండా.. 8.1 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. న‌మీబియా, ఉగాండాలు క్వాలిఫై అవ‌డంతో జింబాబ్వే, కెన్యా, నైజీరియా, టాంజానియా, రువాండాలు నిష్క్ర‌మించాయి.





Tags:    

Similar News