సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా దారుణంగా ఓడిపోయింది. ఒక ఇన్నింగ్స్, 32 పరుగుల తేడాతో సఫారీ సేన ఘన విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్ ద్వారా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డ్ నమోదు చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో 38, రెండో ఇన్నింగ్స్ లో 76 పరుగులు చేసిన విరాట్.. మొదటి టెస్ట్ లో 114 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో.. ఏడు క్యాలెండర్ ఇయర్స్ లో 2000+ పరుగులు చేసిన తొలి బ్యాటర్ గా కోహ్లీ నిలిచాడు. 1877 నుంచి అధికారిక గణాంకాలు చూసుకుంటే.. మరే ఇతర క్రికెటర్ ఈ ఘనత సాధించలేదు. 2012లో 2,186 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. 2014లో 2,286 పరుగులు చేశాడు. 2016లో 2,595 పరుగులు, 2017లో 2,818 పరుగులు, 2018లో 2,735 పరుగులు, 2019లో 2,455 పరుగులు.. ఈ ఏడాదిలో 2,006 సాధించాడు. కోహ్లీ రికార్డ్ పై పలువురు మాజీలు ప్రశంసలు కురిపించారు. రానున్నరోజుల్లో మరికొన్ని రికార్డులు బద్దలు కొట్టాలని ఆశించారు.
మొదటి టెస్ట్లోని మరికొన్ని విశేషాలు:
► సౌతాఫ్రికా తరుపున అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్ లో 7 వికెట్లు పడగొట్టాడు నాండ్రీ బర్గర్. కాగా అరంగేట్ర మ్యాచ్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా బర్గర్ నిలిచాడు.
►తొలి మ్యాచ్ లో 1,263 బంతులు బౌలింగ్ చేశారు. సౌతాఫ్రికా- భారత్ మధ్య అత్యంత త్వరగా ముగిసిన మ్యాచ్ ఇదే.
► 2015 తర్వాత జట్టుకు ఎదురైన భారీ ఓటమి ఇదే. సౌతాఫ్రికాపై 2011 నుంచి ఇప్పుడే ఒక ఇన్నింగ్స్ తేడాతో భారత్ ఓడిపోయింది.
► ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా దేశాల్లో ఆడిన గత ఐదు మ్యాచుల్లో భారత్ ఓడిపోయింది.
► 2014/2015 నుంచి సెంచూరియన్ లో సౌతాఫ్రికా 10 మ్యాచ్ లు ఆడగా.. అందులో ఒకటి మాత్రమే ఓడిపోయింది.