World Cup 2023 : ఆరేసిన ఆస్ట్రేలియా.. చెదిరిన టీమిండియా కల..
వరల్డ్ కప్లో టీమిండియా జైత్రయాత్ర అపజయంతో ముగిసింది. కోట్ల మంది భారతీయుల ఆశలు ఈ మ్యాచ్తో ఆవిరయ్యాయి. ఈ టోర్నీలో ఓటమెరుగని టీమిండియాకు ఆస్ట్రేలియా అడ్డుకట్ట వేసింది. ఫైనల్ మ్యాచ్లో బౌలింగ్, బ్యాటింగ్లో రాణించి ఆరోసారి కప్ కొట్టింది. కీలకమైన మ్యాచ్లో భారత్ బౌలింగ్, బ్యాటింగ్లోనూ ఫెయిల్ అయ్యింది. బ్యాటింగ్లో తక్కువ స్కోర్ నమోదు చేయగా.. అటు బౌలింగ్లోనూ నిరాశపరిచింది.
టీమిండియా ఇచ్చిన 241 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన ఆసీస్ ముందు నుంచే దూకుడుగా ఆడింది. 47 రన్స్కే 3వికెట్లు కోల్పోయినా.. వెనక్కి తగ్గలేదు. ఓపెనర్ హెడ్ భారత్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. ఎక్కడా తడబడకుండా లాబుస్చాగ్నేతో కలిసి తన జట్టుకు ట్రోఫీని అందించాడు. 6 ఓవర్లో మూడో వికెట్ పడగా.. చివరి దాకా మరో వికెట్ పడలేదు. దీంతో భారత్కు నిరాశతప్పలేదు. లక్ష మంది భారత అభిమానుల ముందు ఆసీస్ కనబర్చిన ప్రతిభను తక్కువగా అంచనావేయలేం.
ఈ టోర్నీలో ఫైనల్కు ముందు టీమిండియాకు ఓటమి అన్నదే లేదు. లీగ్లో అన్ని మ్యాచుల్లో గెలిచి.. సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ను చిత్తు చేసి ఎనలేని ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగింది. అయితే అసలైన మ్యాచ్లో ఒత్తిడికి తలొగ్గింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో పట్టు కోల్పోయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా.. భారీ స్కోర్ చేస్తుందని అంతా ఆశించారు. కానీ 200 రన్స్ చేయడమే కష్టంగా మారింది. చివరకు 240 రన్స్ చేసి పర్వాలేదనిపించింది.
బ్యాటింగ్ను పక్కనబెడితే బౌలింగ్లో అయినా మెరుపులు మెరిపిస్తుంది అనుకుంటే.. అదీ లేదు. తొలుత మూడు వికెట్లు తీయగానే.. గెలుపు టీమిండియాదే అనుకున్నారు. కానీ అక్కడి నుంచే అసలు కథ మొదలైంది. దూకుడుగా ఆడుతున్న ఆసీస్ బ్యాటర్లను అడ్డుకునే బౌలరే లేకుండా పోయాడు. బౌలర్లు మారుతున్నారు తప్ప ఆసీస్ బ్యాటర్లు మారలేదు. గత మ్యాచుల్లో బౌలింగ్లో అదరగొట్టిన షమీ కూడా చేతులెత్తేశాడు. చివరకు స్వదేశీ గడ్డపై తిరుగులేదనుకున్న భారత్కు భారీ షాక్ తగిలింది. కప్ను ఆస్ట్రేలియాకు అప్పగించి.. ఇంటిదారి పట్టింది.